Gold Rates | పండుగల సీజన్ నేపథ్యంలో జ్యువెల్లరీ ఆభరణాలు, రిటైల్ వ్యాపారుల నుంచి బంగారానికి గిరాకీ పెరిగింది. దీంతో శుక్రవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.150 వృద్ధి చెంది రూ.78,450 లతో తాజా జీవిత కాల గరిష్ట రికార్డు నమోదు చేసింది. గురువారం బంగారం తులం (24 క్యారట్స్) ధర రూ.78,300 వద్ద స్థిర పడ్డ సంగతి తెలిసిందే. శుక్రవారం కిలో వెండి ధర రూ.1035 వృద్ధితో రూ.94,200లకు చేరుకున్నది. గురువారం కిలో వెండి ధర రూ.93,165 వద్ద ముగిసింది.
శుక్రవారం 99.5 శాతం స్వచ్ఛత గల తులం బంగారం ధర రూ.200 పుంజుకుని రూ.78,100 పలికింది. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో బంగారానికి గిరాకీ పెరిగిందని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో డిసెంబర్ గోల్డ్ కాంట్రాక్ట్స్ తులం ధర రూ.131 పుంజుకుని రూ.76,375లకు చేరుకునింది. ఫిజికల్ మార్కెట్లలో స్పాట్ డిమాండ్ నేపథ్యంలో వెండికి కూడా గిరాకీ ఎక్కువైంది. ఫలితంగా ఎంసీఎక్స్‌లో కిలో వెండి డిసెంబర్ డెలివరీ కాంట్రాక్ట్స్ ధర రూ.219 పుంజుకుని రూ.93,197 పలికింది. గ్లోబల్ మార్కెట్లలో కామెక్స్ గోల్డ్ లో ఔన్స్ బంగారం ధర ఫ్లాట్‌గా 2678.90 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. ఇదిలా ఉంటే ఔన్స్ బంగారం ధర 32.37 డాలర్ల వద్ద ముగిసింది.