Gold – Silver Rates | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ధగధగ మెరుస్తున్నాయి. ఫెస్టివల్ సీజన్, పెండ్లిండ్ల నేపథ్యంలో గిరాకీ పెరగడంతో బంగారానికి రెక్కలొచ్చాయి. వరుసగా మూడో రోజు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.50 పెరిగింది. తద్వారా బంగారం ధర రూ.78,300లకు చేరుకున్నదని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ తెలిపింది. గురువారం పది గ్రాముల బంగారం (24 క్యారట్లు) ధర రూ.78,250 పలికిన సంగతి తెలిసిందే.
ఇక కిలో వెండి ధర సైతం రూ.500 వృద్ధి చెంది రూ.94,500లకు చేరింది. గురువారం కిలో వెండి ధర రూ.94 వేల వద్ద స్థిర పడింది. గ్లోబల్ మార్కెట్లతోపాటు పండుగలు, పెండ్లిండ్ల సీజన్ నేపథ్యంలో జ్యువెల్లరీ ఆభరణాల కోసం కస్టమర్ల నుంచి గిరాకీ పెరిగిందని రిటైల్ ట్రేడర్లు చెబుతున్నారు. యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు తగ్గించడం వల్లే బులియన్ మార్కెట్లో బంగారం ధరలకు రెక్కలొచ్చాయని చెబుతున్నారు.
ఇక మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో 24 క్యారట్ల బంగారం అక్టోబర్ డెలివరీ తులం ధర రూ.181 తగ్గి రూ.75,206 వద్ద స్థిర పడింది. కిలో వెండి కాంట్రాక్ట్స్ డిసెంబర్ డెలివరీ ధర రూ.142 పతనమై రూ.95,522 వద్ద ముగిసింది. మరోవైపు, గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 0.29 శాతం తగ్గి 2687.20 డాలర్లు పలికింది. యూఎస్ డేటా మెరుగ్గా ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇచ్చారని విశ్లేషకులు చెప్పారు. ఔన్స్ వెండి ధర 0.36 శాతం పతనమై 32.33 డాలర్లకు చేరుకున్నది.