Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ధరలు మరోసారి పెరిగి మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల బంగారంపై రూ.1800 పెరిగి తులానికి రూ.1,15,100కి చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల పుత్తడి ధర సైతం రూ.1800 పెరిగి.. తులం రూ.1,14,600 జీవితకాల గరిష్టానికి చేరుకుంది. అదే సమయంలో వెండి సైతం రూ.570కి చేరింది. దాంతో కిలో ధర రూ.1,32,870 పెరిగి ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. డాలర్ బలహీనపడడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోత అంచనాల నేపథ్యంలో మంగళవారం పసిడి ధరలు గరిష్టానికి చేరుకున్నాయి. డాలర్ ఇండెక్స్ పది వారాల కనిష్టానికి పడిపోయింది.
దాంతో విలువైన లోహాలకు మద్దతుగా నిలిచిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్లలో భారీగా కోతలు విధించాలని అధ్యక్షుడు ట్రంప్ భారీగా ఒత్తిడి తెస్తున్నారు. దాంతో బంగారం ర్యాలీకి మరింత ఊతమిచ్చినట్లయ్యిందని చెప్పారు. ఉపాధి డేటా బలహీనంగా ఉండడం, ట్రంప్ ప్రభావం నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించనుందనే అంచనాలు పెంచాయన్నారు. ఆరు కరెన్సీల బాస్కెట్‌తో పోలిస్తే డాలర్ ఇండెక్స్ 0.28శాతం తగ్గి 97.03కి చేరుకుంది. ఇది బులియన్ మార్కెట్లో ధరలకు మరింత మద్దతుగా నిలిచింది.
విదేశీ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 3,698.94 డాలర్లకు పెరిగి కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. అదే సమయంలో స్పాట్ వెండి 0.10 శాతం పెరిగి ఔన్సుకు 42.72 డాలర్లకు ఎగిసింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ రెండురోజుల పాలసీ సమావేశం నేపథ్యంలో బంగారం భారీగా ట్రేడవుతుందని ఆగ్మాంట్ రీసెర్చ్ విభాగం చీఫ్ రెనిషా చైనాని పేర్కొన్నారు. డిసెంబర్ తర్వాత తొలిసారిగా బుధవారం ఫెడ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని, వచ్చే ఏడాది కూడా ఈ సడలింపు కొనసాగుతుందని మార్కెట్లు అంచనా వేస్తున్నారు. ఈ వారంలో జరిగే జెరోమ్ పావెల్ విలేకరుల సమావేశాన్ని పెట్టుబడిదారులు, వ్యాపారులు నిశితంగా పరిశీలిస్తారని రెనిషా తెలిపారు. భౌగోళిక రాజకీయ నష్టాలు, కొనసాగుతున్న సుంకాల ఉద్రిక్తతలు సురక్షితమైన పెట్టుబడులకు డిమాండ్‌ను పెంచుతున్నాయని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా తెలిపారు. ప్రతికూల పరిస్థితులు పెట్టుబడిదారులను బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ప్రేరేపిస్తున్నాయని చెప్పారు. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.1.19,930 ఉండగా.. 22 క్యారెట్ల పసిడి రూ.1,02,600 వద్ద కొనసాగుతున్నది. కిలో వెండి రూ.1.44లక్షలు పలుకుతున్నది.