Gold Rate | పుత్తడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. మంగళవారం ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రూ.800 తగ్గి పది గ్రాములకు రూ.98,500 పలుకుతున్నది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ సైతం ధ్రువీకరించింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర సైతం రూ.800 తగ్గడంతో తులానికి రూ.98వేలు పలుకుతుందని పేర్కొంది. అదే సమయంలో వెండి ధరలు సైతం భారీగానే పడిపోయాయి. రూ.1,370 తగ్గి.. కిలోకు రూ.99వేలు పలుకుతున్నది. వెండి సోమవారం కిలోకు రూ.లక్షపైగానే ట్రేడ్ అయ్యింది. యుఎస్, బ్రస్సెల్స్ మధ్య వాణిజ్య చర్చలు ధరలపై ప్రభావం చూపాయి. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 45.03 తగ్గి ఔన్సుకు 3,296.92 చేరాయి.
అమెరికాతో వాణిజ్య చర్చలను వేగవంతం చేయాలని బ్రస్సెల్స్ ఒత్తిడి చేస్తుండడంతో విలువైన లోహానికి డిమాండ్ స్వల్పంగా తగ్గిందని కోటక్ సెక్యూరిటీస్‌లోని కమోడిటీ రీసెర్చ్ ఏవీపీ కైనత్ చైన్వాలా తెలిపారు. సుంకాలు, ద్రవ్యోల్బణం ఆందోళనల మధ్య పెట్టుబడిదారులు యూఎస్ డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్ అండ్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ డేటాపై దృష్టి సారించారని.. డేటాలోని గణాంకాలు ఆర్థిక దృక్పథం గురించి మరింత సమాచారం తెలుస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పసిడి రూ.89,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.98,130 పలుకుతున్నది. కిలో వెండి రూ.1.11లక్షలుగా ఉన్నది. ఇక ప్లాటినం తులం ధర రూ.29,930 వద్ద కొనసాగుతున్నది.