Gold Price | మొన్నటి వరకు ఆకాశన్నంటిన పుత్తడి ధరలు.. ప్రస్తుతం క్రమంగా దిగి వస్తున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో డిమాండ్ ధరలు పతనమవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో మంగళవారం బంగారం ధరలు రూ.4,100 తగ్గి రూ.1,21,800కి చేరింది. ప్రపంచ మార్కెట్లలో కూడా బంగారం ఔన్సుకు 4వేల డాలర్ల కంటే తక్కువ ట్రేడ్ అయ్యింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధ్రువీకరించింది. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల పసిడి ధర సైతం రూ.1400 తగ్గి తులానికి రూ.1,21,200 చేరుకుందని పేర్కొంది.
మంగళవారం బంగారం ధరలు తగ్గాయని.. సురక్షిత పెట్టుబడులకు డిమాండ్ తగ్గడం వల్ల డిమాండ్ తగ్గిందని, అలాగే అమ్మకాలు తీవ్రవడంతో ధరలు మూడు వారాల కనిష్టానికి పడిపోయాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ తెలిపారు. బంగారం ధరలతో పాటు వెండి ధర సైతం రూ.6,250 తగ్గి.. కిలో ధర రూ.1.45లక్షలకు చేరుకుంది. సోమవారం వెండి ధరలు కిలోకు రూ.1,51,250 వద్ద కొనసాగిందని సరాఫా అసోసియేషన్ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ఒత్తిడికి గురైంది.
2.37 శాతం తగ్గి ఔన్సుకు 3,887.03 డాలర్లకు చేరుకుంది. గత సెషన్లో 3.21శాతం పెరిగి 4వేల డాలర్లకు దగ్గరలో స్థిరపడింది. మిరే అసెట్ షేర్ఖాన్లోని కమోడిటీస్ అండ్ కరెన్సీ హెడ్ ప్రవీణ్ సింగ్ మాట్లాడుతూ.. యూఎస్-చైనా వాణిజ్య ఒప్పందం విషయంలో ఉద్రిక్తతలు తగ్గడం.. ఒప్పందంపై ఆశలు నెలకొన్న నేపథ్యంలో డిమాండ్ లేకపోవడంతో స్పాట్ గోల్డ్ ఒత్తిడికి గురైందని పేర్కొన్నారు. జపాన్‌తో వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేయడం కూడా బులియన్ ధరలను ప్రభావితం చేసింది.
యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ విధాన ఫలితాలు బుధవారం వెలువడనుండగా.. పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని భావిస్తున్నారని ప్రవీణ్ సింగ్ పేర్కొన్నారు. స్పాట్ సిల్వర్ సైతం 2.85శాతం పతనమై.. ఔన్స్‌కు 45.56 డాలర్ల కనిష్టానికి చేరుకుంది. బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని.. ఈ ఏడాది 50శాతానికిపైగా ధరలు పెరిగాయని.. వ్యాపారులు లాభాల స్వీకరణకు దిగే అవకాశం ఉన్నందున ధరలు 5 నుంచి 10శాతం వరకు తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందని సౌమిల్ గాంధీ పేర్కొన్నారు.