Gold Rates | అంతర్జాతీయంగా బలహీన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.50 తగ్గి రూ.61,770 వద్దకు చేరుకున్నదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. ఇంతకుముందు సెషన్లో తులం బంగారం ధర రూ.61,820 వద్ద స్థిర పడింది. మరోవైపు కిలో వెండి ధర సైతం రూ.300 తగ్గి రూ.76 వేల వద్ద నిలిచింది.
అమెరికా ఎకనమిక్ డేటా సానుకూలంగా ఉండటంతోపాటు యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు పెంచకపోవచ్చునన్న అంచనాల నేపథ్యంలో బంగారం ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇచ్చారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు తగ్గిపోయాయి. ఔన్స్ బంగారం (24 క్యారట్స్) ధర 1978 డాలర్లు, ఔన్స్ వెండి 23.55 డాలర్లు పలుకుతున్నది.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం (22 క్యారట్ల) బంగారం ధర రూ.13 తగ్గి రూ.60,700 వద్ద తచ్చాడుతోంది. అతర్జాతీయంగా న్యూయార్క్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 0.20 శాతం తగ్గుముఖం ఔన్స్ బంగారం 1980.80 డాలర్ల వద్ద స్థిర పడింది.