Gold Rates | అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా జ్యువెలర్లు, రిటైల్ కొనుగోలుదారుల నుంచి గిరాకీ లేకపోవడంతో బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.150 తగ్గి రూ.81,150 లకు చేరుకున్నది. మరోవైపు కిలో వెండి ధర ఫ్లాట్ గా కొనసాగింది. 99.5 శాతం స్వచ్ఛత గల తులం బంగారం ధర రూ.150 తగ్గి రూ.80,750 వద్ద స్థిర పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో డిసెంబర్ డెలివరీ గోల్డ్ కాంట్రాక్ట్స్ ధర రూ.333 పతనమై రూ.78,174 వద్ద ముగిసింది. ఇంట్రా డే ట్రేడింగ్‌లో బంగారం ధర రూ.78,500 – రూ.77,500 మధ్య తచ్చాడింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం ఖాయం కావడంతో ఫారెక్స్ మార్కెట్లో యూఎస్ డాలర్ పుంజుకున్నది. కిలో వెండి డిసెంబర్ డెలివరీ ధర రూ.1,122 తగ్గి రూ.93,526 వద్ద స్థిర పడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో కిలో వెండి ధర రూ.3,158 వరకూ పతనమై 91,490 వద్ద నిలిచింది.
అంతర్జాతీయ మార్కెట్లో ప్రత్యేకించి ఫారెక్స్ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ బలోపేతం అయింది. ఫలితంగా అంతర్జాతీయంగా బంగారం ధర 2700 డాలర్లు, దేశీయంగా తులం బంగారం ధర రూ.77,500 మధ్య తచ్చాడుతుందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అంతర్జాతీయంగా కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ లో ఔన్స్ బంగారం ధర 15.60 డాలర్లు క్షీణించి 2734.10 డాలర్లకు చేరుకున్నది. కామెక్స్ సిల్వర్‌లో ఔన్స్ వెండి ధర 32.42 డాలర్లు పలికింది. తాజాగా వడ్డీరేట్లపై యూఎస్ ఫెడ్ రిజర్వ్ నిర్ణయం, గురువారం మైక్రో ఎకనమిక్ డేటా ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు.