Gold Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు భారీ ఊరటనిస్తున్నాయి. వరుసగా రెండోరోజు ధరలు గణనీయంగా తగ్గాయి. ఇటీవల పసిడి గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరుగుతూ సరికొత్త గరిష్టానికి చేరిన విషయం తెలిసింది. తాజాగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండడంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల బంగారంపై రూ.600 తగ్గడంతో తులం ధర రూ.1,13,200కి తగ్గిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. అదే సమయంలో 22 క్యారెట్ల పసిడి రూ.500 తగ్గి తులం రూ.1,12,800కి తగ్గింది. అయితే, అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పతనమయ్యాయి.
బుధవారం రాత్రి ఫెడ్ రిజర్వ్ 25 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. దాదాపు తొమ్మిది నెలల తర్వాత వడ్డీ రేట్లను తగ్గించడం విశేషం. ఈ క్రమంలో మార్కెట్లో బంగారానికి డిమాండ్ తగ్గిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. మరో వైపు ఈ ఏడాది చివరి నాటికి మరో రెండుసార్లు వడ్డీ రేట్లను అవకాశం ఉందని అంచనా. ఇదే జరిగితే ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నది. విదేశీ మార్కెట్లో, స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.23 శాతం పెరిగి 3,668.33 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ వెండి ఔన్సుకు 0.55 శాతం పెరిగి 41.90కి చేరింది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల బంగారం రూ.1,11,170 ఉండగా.. 22 క్యారెట్ల పసిడి రూ.1,01,900 పలుకుతున్నది. ఇక వెండి కిలోకు రూ.1.41లక్షల వద్ద ట్రేడవుతున్నది.