న్యూఢిల్లీ, జనవరి 18: బంగారం మరింత దిగింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతో వరుసగా మూడోరోజు గురువారం రూ.63 వేల దిగువకు పడిపోయాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.300 తగ్గి రూ.62,750 వద్దకు చేరుకున్నాయి. అటు వెండి ధరలు కూడా రూ.200 తగ్గి రూ.75,600 వద్ద ముగిశాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.300 దిగి రూ.57,700 నుంచి రూ.57,400కి దిగిరాగా, 24 క్యారెట్ల పదిగ్రాముల ధర రూ.330 తగ్గి రూ.62,620కి తగ్గింది. పసిడితోపాటు కిలో వెండి రూ.400 తగ్గి రూ.77 వేలకు పరిమితమైంది. అమెరికాలో రిటైల్ సేల్స్ డాటా అంచనాలకుమించి పెరగడం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. యూఎస్ ఆర్థిక వ్యవస్థ బలపడుతున్నట్లు వచ్చిన సంకేతాలతో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు సన్నగిల్లాయి.