న్యూఢిల్లీ, మార్చి 25 : బంగారం నగదీకరణ పథకాన్ని (జీఎంఎస్) కేంద్ర ప్రభుత్వం ఆపేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. బుధవారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఓ ప్రకటనలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం మార్కెట్లో గోల్డ్ రేట్లు రికార్డు స్థాయిలో పలుకుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. కాగా, సెప్టెంబర్ 15, 2015న ఈ స్కీంను మోదీ సర్కారు పరిచయం చేసిన విషయం తెలిసిందే.
గృహస్తుల వద్ద, సంస్థాగతంగా నిరుపయోగంగా నిల్వ ఉన్న బంగారాన్ని వినియోగంలోకి తీసుకురావడమే దీని లక్ష్యం. ఈ క్రమంలోనే గత ఏడాది నవంబర్‌దాకా 31,164 కిలోల పుత్తడిని కేంద్రం సేకరించింది. ఇక ఈ పథకంలో షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ (1-3 ఏండ్లు), మీడియం టర్మ్ ప్రభుత్వ డిపాజిట్ (5-7 ఏండ్లు), లాంగ్ టర్మ్ ప్రభుత్వ డిపాజిట్ (12-15 ఏండ్లు) అనే మూడు రకాల స్కీములుంటాయి. వీటిలో ఇకపై మీడియం, లాంగ్ టర్మ్ ప్రభుత్వ డిపాజిట్లు నిలిచిపోతాయి. అయినప్పటికీ వీటి రిడెంప్షన్ కొనసాగుతుంది. మరోవైపు షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్‌ను బ్యాంకులు కొనసాగించే వీలున్నది.