దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు క్రమేణా క్షీణిస్తున్నాయి. వారం రోజుల క్రితం ఆల్‌టైమ్ హై రికార్డు దిశగా పుత్తడి రేటు పరుగులు పెడితే.. వెండి విలువ మాత్రం సరికొత్త స్థాయిని నమోదు చేసింది.
కానీ ఆ తర్వాత నుంచి వరుసగా పడిపోతూనే ఉన్నాయి. ఓవైపు ఇన్నాళ్లూ నిల్వ చేసుకున్న మదుపరులు అమ్మకాలకు పెడుతుంటే.. మరోవైపు ఇంకా ధరలు తగ్గుతాయేమోనన్న ఆశతో రిటైల్ మార్కెట్‌కు కొనుగోలుదారులు దూరంగా ఉంటున్నారు.
న్యూఢిల్లీ, జూలై 29: బంగారం, వెండి ధరలు రోజుకింత పడిపోతున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో మంగళవారం 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) పుత్తడి 10 గ్రాముల రేటు మరో రూ.200 క్షీణించి రూ.98వేల మార్కుకు దిగువన రూ.97,820గా నమోదైంది. ఈ మేరకు అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. నిజానికి గత 5 రోజులుగా పసిడి విలువ అంతకంతకూ దిగజారిపోతూనే ఉన్నది. ఈ డౌన్ ట్రెండ్‌లో మొత్తంగా రూ.3,200 తగ్గడం గమనార్హం. కాగా, అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ)ల మధ్య వాణిజ్య ఒప్పందం, డాలర్‌కు మద్దతుగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఈసారి ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచుతుందన్న అంచనాలు.. గోల్డ్ మార్కెట్లో ధరల పతనానికి దారి తీశాయని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు.
హైదరాబాద్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. వరుసగా ట్రేడింగ్ జరిగిన గత 5 రోజుల్లో తులం 24 క్యారెట్ పసిడి ధర రూ.2,510, 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) రేటు రూ.2,300 చొప్పున క్షీణించాయి. మంగళవారం 24 క్యారెట్ బంగారం విలువ 10 గ్రాములు రూ.110 తగ్గి రూ.99,820 వద్ద, 22 క్యారెట్ రూ.100 దిగి రూ.91,500 వద్ద నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్ విషయానికొస్తే.. స్పాట్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు 9.48 డాలర్లు పెరిగి 3,324.11 డాలర్లుగా ఉన్నది. వెండి 38.14 డాలర్లు పలికింది.
ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర మంగళవారం స్థిరంగా రూ.1,13,000గానే ఉన్నది. అయితే గత 5 రోజుల్లో రూ.5,000 పడిపోయింది. ఈ నెల 23న కిలో వెండి రేటు రూ.4,000 ఎగిసి మునుపెన్నడూ లేనివిధంగా ఆల్‌టైమ్ హై రికార్డును నెలకొల్పుతూ రూ.1,18,000 పలికిన విషయం తెలిసిందే. తులం పసిడి ధర సైతం రూ.1,000 పుంజుకొని రూ.1,01,020గా నమోదైంది. మరో రూ.581 పెరిగితే.. ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన ఆల్‌టైమ్ హై రికార్డు కనుమరుగయ్యేది. ఏప్రిల్ 22న తొలిసారి 1,01,600 స్థాయిని తాకింది.