Gold Returns | బంగారం అంటే భారతీయులకు.. అందునా మహిళామణులకు ఎంతో ఇష్టం. ప్రతి పండక్కీ, శుభకార్యానికి మహిళలు పిసరంత బంగారం కొనుక్కోవాలని ఉబలాట పడుతుంటారు. వేడుకల్లో బంగారం ఆభరణాలు ధరించాలని కోరుకుంటారు. కేవలం ఆభరణంగా మాత్రమే కాదు ఇటీవలి కాలంలో ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా బంగారం కొనుగోలు చేస్తున్నారు. గత ఐదేండ్లలో బంగారం ధర రెట్టింపు పెరిగింది. 2018 మార్చిలో 10 గ్రాముల (24 క్యారట్లు) బంగారం ధర రూ.31 వేలు పలికితే.. ఇప్పుడు రూ.60 వేల మార్క్ వద్దకు చేరింది. అంటే గత ఐదేండ్లలో బంగారం ధర రెట్టింపైంది.
పదేండ్లలో బంగారం ధర 100 శాతానికి పెగా పెరిగింది. 2013 మార్చిలో తులం బంగారం ధర రూ.29 వేలు పలికింది. ఇప్పుడు పది గ్రాముల (24 క్యారట్లు) బంగారం ధర రూ.60 వేల మార్క్‌కు చేరింది. గతేడాది (2022 మార్చి) పుత్తడి ధర రూ.52 వేల వద్ద కదలాడింది. కేవలం ఒక ఏడాది కాలంలోనే బంగారంపై పెట్టుబడులపై 15 శాతం రిటర్న్స్ వచ్చాయి.
స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులు వచ్చినప్పుడల్లా బంగారం ధరకు మద్దతు పెరుగుతుందని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్గుప్తా చెప్పారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరికల్లా బంగారం తులం (24 క్యారట్లు) ధర రూ.65 వేల వరకూ దూసుకెళ్తుందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బంగారంపై పెట్టుబడులు పెట్టేవారు కనీసం మూడేండ్ల నుంచి ఐదేండ్ల వరకు ఆ పెట్టుబడులు అలాగే కొనసాగించాలని అనూజ్ గుప్తా చెప్పారు. మొత్తం పెట్టుబడుల్లో 10-15 శాతం బంగారంపై మదుపు చేయాలని సూచించారు. సంక్షోభ సమయంలో మీకు బంగారం స్థిరత్వాన్ని ఇస్తుందని చెప్పారు.
ఇప్పుడు బంగారం ప్యూరిటీకి (స్వచ్ఛత) ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇస్తున్నారు. అనధికారికంగా స్వర్ణకారుల వద్ద బంగారం కొనుగోలు చేసినప్పుడు దాని ప్యూరిటీకి గ్యారంటీ ఉండటం లేదు. హైదరాబాద్‌లో సత్య ప్రకాశ్ అనే ప్రింటింగ్ బిజినెస్ గల వ్యాపారి ఐదేండ్ల క్రితం ధంతేరాస్ వేళ బంగారం కొనుగోలు చేశాడు. ఇటీవల ఎమర్జెన్సీగా డబ్బు అవసరం పడింది. ఇప్పుడు భారీగా ధర పెరగడంతో ఐదేండ్ల క్రితం కొన్న బంగారం విక్రయించడానికి వెళ్లాడు. అక్కడ బులియన్ వ్యాపారి సదరు బంగారం 15 క్యారట్ల స్వచ్ఛత మాత్రమే ఉందని తేల్చారు. తనకు బంగారం అమ్మినప్పుడు స్వర్ణకారుడు 19 క్యారట్ల ప్యూరిటీ ఉందని నమ్మ బలికాడని సత్య ప్రకాశ్ వాపోయాడు. దీంతో సత్య ప్రకాశ్ తన బంగారం అమ్ముకోలేక, అవసరానికి డబ్బు దొరకక ఇబ్బందుల పాలయ్యాడు. కనుక బంగారం స్వచ్ఛత విషయంలో రాజీ పడొద్దని బులియన్ వ్యాపారులు, కేంద్రం ప్రభుత్వం సాధారణ ప్రజల్ని హెచ్చరిస్తున్నారు.
ఇక నుంచి ఫిజికల్ గోల్డ్, బంగారం ఆభరణాలు కొనుగోలు చేసే వారు దాని ప్యూరిటీ విషయంలో మోసపోయేందుకు ఆస్కారమే లేదు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బంగారం ఆభరనాలపై హాల్‌మార్కింగ్ హాల్ మార్కింగ్ తప్పనిసరి. అంటే, జ్యువెల్లరీ వ్యాపారులంతా హాల్మార్క్డ్ గోలండ్ మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. 6-డిజిట్స్ అల్ఫాన్యూమరిక్ హాల్‌మార్క్ కోడ్ ఆయా బంగారం ఆభరణాలపై తప్పనిసరిగా ఉంటుంది. ఈ కోడ్‌ను బట్టి సదరు ఆభరణం ప్యూరిటీ కలిగి ఉంటుందా.. లేదా అనే తెలిసిపోతుంది.