Gold – Silver Rates | వరుసగా మూడో రోజు బంగారం ధరలు దిగి వచ్చాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.170 తగ్గి రూ.78,130లకు చేరుకున్నది. గురువారం 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం రూ.78,300 పలికింది. మరోవైపు శుక్రవారం కిలో వెండి ధర రూ.1,800 పతనమై రూ.88,150లకు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.90 వేలు పలికింది. ఇక మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ఫిబ్రవరి డెలివరీ బంగారం తులం ధర రూ.50 పెరిగి రూ.75,071 వద్ద నిలిచింది. వెండి ఫ్యూచర్స్ మార్చి డెలివరీ ధర రూ.86,540 పలికింది.
అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ బంగారం ధర 13.10 డాలర్లు వృద్ధి చెంది 2621.20 డాలర్లకు చేరుకుంది. ఇక ఔన్స్ వెండి ధర 0.41 శాతం పతనమై 29.29 డాలర్లు పలికింది. వడ్డీరేట్ల తగ్గింపు విషయమై యూఎస్ ఫెడ్ రిజర్వ్ నిర్ణయం వల్లే బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయని బులియన్ మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు.