Gold Rates | దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా రెండో రోజు తులం బంగారం (24 క్యారట్లు) ధర తగ్గింది. మంగళవారం తులం బంగారం ధర రూ.200 తగ్గి రూ.79 వేలకు చేరుకున్నది. సోమవారం 99.9 శాతం బంగారం తులం ధర రూ.79,200 వద్ద నిలిచింది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.200 పతనమై రూ.78,600లకు చేరుకున్నది. మరోవైపు కిలో వెండి ధర మంగళవారం రూ.2,400 వృద్ధి చెంది రూ.92,400 వద్ద స్థిర పడింది. ఇండస్ట్రీయల్ మార్కెట్ నుంచి గిరాకీ రావడంతో వెండికి డిమాండ్ పెరిగిందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం ఫిబ్రవరి డెలివరీ ధర రూ.146 వృద్ధితో రూ.76,833 పలికింది. కిలో వెండి ధర రూ.1,251 పెరిగి రూ.92,061 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్‌లో ఔన్స్ బంగారం ధర 7.40 డాలర్లు పుంజుకుని 2,665.90 డాలర్లు పలికింది. ఔన్స్ వెండి ధర 1.93 శాతం పెరిగి 31.46 డాలర్లకు చేరుకుంది. ద్రవ్యోల్బణం తగ్గడంతోపాటు అమెరికాలో లేబర్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతుండటంతో డిసెంబర్లో వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ క్రిస్టోఫర్ వాలర్ తెలిపారు.