Gold and Silver : రాకెట్ల దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు శుక్రవారం ఒక్కసారిగా పడిపోయాయి. బంగారం ధర రూ.5 వేలకు పైగా తగ్గగా, వెండి ధర రూ.30 వేల వరకు తగ్గింది. అంటే వెండి ధరలు 15 శాతం మేర తగ్గాయి. బంగారం ధర దాదాపు 10 శాతం వరకు తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం ఉదయం 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,74,700 వరకు ఉంది.
అంతకుముందు రోజు రాత్రి ధర రూ.1,79,700గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.1,52,000గా ఉంది. అంటే ఒక్క రోజులోనే దాదాపు రూ.5,000 తగ్గింది. శుక్రవారం వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. గురువారం వెండి కిలో ధర రూ.3,99,600 ఉండగా.. శుక్రవారం నాటికి రూ.3,70,000కు పడిపోయింది. అంటే ఒక్క రోజులోనే ధర సుమారు రూ.30,000 తగ్గింది. దేశీయ మార్కెట్లోనే కాకుండా.. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ ధరలు తగ్గాయి. ఔన్స్ బంగారం ధర 5,189 డాలర్లుగా, ఔన్స్ వెండి ధర 110 అమెరికన్ డాలర్లుగా ఉంది. ఫ్యూచర్స్ ట్రేడింగ్లో కూడా మెటల్స్ ధరలు తగ్గిపోయాయి.
ఇక.. బంగారం, వెండి ధరలు ప్రస్తుతం పెరగడానికి అంతర్జాతీయ రాజకీయ పరిణామాలే కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏ క్షణమైనా బంగారం, వెండి ధరలు తగ్గుతాయని.. ఈ గాలి బుడగ ఎప్పుడైనా పేలిపోతుందని అంటున్నారు. అందువల్ల ధరల పెరుగుదలపై ఆందోళన అవసరం లేదనేది కొందరు నిపుణుల అంచనా. ప్రస్తుతం ధరల పెరుగుదల ట్రెండ్ నడుస్తుండటంతో దేశంలో బంగారం కొనుగోళ్లు తగ్గినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గోల్డ్ సామాన్యుడికి అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం. ఇదే సమయంలో చాలా మంది కాపర్ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.