Gold Rates | గత జూలైలో బంగారం, వెండి దిగుమతులపై సుంకాలు తగ్గించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం వచ్చే ఆర్థిక సంవత్సర (2025-26) వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. నిర్మలా సీతారామన్ దిగుమతి సుంకాలు తగ్గించడంతో కొద్ది రోజులు స్వల్పంగా బంగారం ధరలు తగ్గినా.. యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు తగ్గించినా.. తాజాగా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక విధానాలపై దృష్టి సారించిన ఇన్వెస్టర్లు.. తమ పెట్టుబడులకు స్వర్గధామంగా బంగారాన్ని పరిగణిస్తున్నారు. శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టే బడ్జెట్ సానుకూలంగా ఉంటుందన్న అంచనాల మధ్య దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధగధగ మెరిసింది.
శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (99.9 శాతం స్వచ్ఛత) ధర రూ.1100 వృద్ధితో రూ.84,900 పలికింది. జనవరి ఒకటో తేదీ నుంచి తులం బంగారం ధర రూ.5,510 (7 శాతం) పెరిగింది. జనవరి ఒకటో తేదీన తులం బంగారం ధర రూ.79,390 పలికింది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర కూడా రూ.1,100 పెరిగి రూ.84,500లతో జీవిత కాల గరిష్టాన్ని తాకింది. గురువారం తులం బంగారం ధర రూ. 83,400 వద్ద స్థిర పడిన సంగతి తెలిసిందే. శుక్రవారం కిలో వెండి ధర రూ.850 వృద్ధితో రూ. 95,000 వద్ద ముగిసింది. గురువారం కిలో వెండి ధర రూ.94,150 వద్ద స్థిర పడింది.
‘అంతర్జాతీయ మార్కెట్లో బంగారం బుల్లిష్‌గా ఉంది. స్పాట్ గోల్డ్ తులం ధర ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఔన్స్ బంగారం 2,800 డాలర్లు పలికింది. ఢిల్లీలో స్పాట్ గోల్డ్ ధర రూ.84,000-మార్క్‌ను దాటేసింది” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ చెప్పారు. ఫ్యూచర్స్ మార్కెట్ – మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ఫిబ్రవరి డెలివరీ గోల్డ్ కాంట్రాక్ట్స్ తులం బంగారం ధర రూ.487 (0.6 శాతం) పెరిగి రూ.82,210లతో మరో జీవిత కాల గరిష్ట రికార్డు నమోదు చేసింది. ఏప్రిల్ కాంట్రాక్ట్స్ తులం బంగారం ధర రూ.371 (0.45శాతం) పుంజుకుని తాజాగా రూ.82,415 జీవిత కాల గరిష్ట స్థాయికి చేరుకుంది. మార్చి డెలివరీ కిలో కాంట్రాక్ట్స్ వెండి ధర రూ.403 (0.43 శాతం) పెరిగి రూ.93,849 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూ. 629 (0.67 శాతం) పెరిగి రూ.94,075లకు చేరుకున్నది.
అంతర్జాతీయంగా కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఏప్రిల్ డెలివరీ బంగారం ఔన్స్ ధర రూ.2,842.40 డాలర్లతో స్థిర పడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 2,859.45 డాలర్లతో గరిష్టాన్ని తాకిందని కోటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. గతేడాది అక్టోబర్‌లో బంగారం ఫ్యూచర్స్‌లో ఔన్స్ బంగారం ధర 2,859.50 డాలర్లతో జీవిత కాల గరిష్టాన్ని తాకింది. మెక్సికో, కెనడా దేశాలపై సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఇన్వెస్టర్లు బంగారాన్ని ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్‌గా పరిగణిస్తున్నారు. కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్‌లో మార్చి కాంట్రాక్ట్స్ ఔన్స్ వెండి ధర 0.31 శాతం వృద్ధితో 32.60 డాలర్లు పలికింది.