Gold Rates | జ్యువెల్లర్లు, రిటైల్ వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో దేశీయ రాజధాని ఢిల్లీలో గురువారం తులం బంగారం (99.9 శాతం స్వచ్ఛత) ధర రూ.330 వృద్ధి చెంది రూ.79,720లకు చేరుకుంది. బుధవారం 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.79,390 వద్ద స్థిర పడింది. గురువారం కిలో వెండి ధర రూ.130 పెరిగి రూ.90,630లకు చేరుకున్నది. బుధవారం కిలో వెండి ధర రూ.90,500 పలికింది. ఇక 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.330 పెరిగి రూ.79,170 వద్ద నిలిచింది. బుధవారం ఇది రూ.78,840 వద్ద నిలిచింది.
మరోవైపు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం ఫిబ్రవరి డెలివరీ ధర రూ.205 పెరిగి రూ.77,098లకు చేరుకుంది. కిలో వెండి మార్చి డెలివరీ ధర రూ.859 వృద్ధితో రూ.88,437 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్’లో ఔన్స్ బంగారం ధర 8.50 డాలర్ల వృద్ధితో 2,649.50 డాలర్లకు పెరిగింది. సిల్వర్ కామెక్స్’లో ఔన్స్ వెండి ధర 1.62 శాతం వృద్ధితో 29.72 డాలర్ల వద్ద స్థిర పడింది.
ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్ మీద రూపాయి మారకం విలువ బలహీన పడటం వల్లే దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం, మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే బంగారం ధర మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఐదారు నెలల్లో ఔన్స్ బంగారం 3000 డాలర్లు.. దేశీయంగా తులం బంగారం రూ.85 వేలు, ఔన్స్ వెండి 38 డాలర్లు.. కిలో వెండి రూ.1.15 లక్షలు పలుకుతుందని ఆగుమెంట్ రీసెర్చ్ హెడ్ రెనీషా చైనానీ చెప్పారు.