Gold Rates | కొత్త సంవత్సరంలో తొలి రోజు బులియన్ మార్కెట్లో ధగధగలు నమోదయ్యాయి. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర తులం రూ.440 వృద్ధి చెంది రూ.79,390 పలికింది. స్టాకిస్టులు తాజాగా కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో బంగారం ధర పెరిగింది. మంగళవారం తులం బంగారం ధర (99.9 శాతం స్వచ్ఛత) రూ.78,950 పలికింది. ఇక 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర బుధవారం రూ.440 వృద్ధితో రూ.78,840లకు చేరుకున్నది. మంగళవారం 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ.78,400 వద్ద స్థిర పడింది.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.800 వృద్ధితో రూ.90,500 వద్ద స్థిర పడింది. మంగళవారం కిలో వెండి ధర రూ.89,700 పలికింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్) లో గోల్డ్ కాంట్రాక్ట్స్ ఫిబ్రవరి డెలివరీ బంగారం తులం ధర ఫ్లాట్ గా రూ.76,893 పలికింది. సిల్వర్ కాంట్రాక్ట్ మార్చి డెలివరీ కిలో వెండి ధర రూ.28 పతనమై రూ.87,550 వద్ద స్థిర పడింది. నూతన సంవత్సరం సందర్భంగా అంతర్జాతీయ మార్కెట్లకు బుధవారం సెలవు అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.