న్యూఢిల్లీ, మే 29: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.1,600 అందుకొని రూ.1.62 లక్షలకు చేరుకున్నది. గోల్డ్తోపాటు వెండి పరుగులు పెట్టింది. కిలో వెండి ఏకంగా రూ.5 వేలు అందుకొని రూ.2,74,700 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ నెలకొనడం, అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉండటంతో ధరలు పుంజుకున్నాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
స్వల్పకాలంపాటు బంగారం ధరలు అనిశ్చితిలోనే కొనసాగనున్నాయని, ఆర్థిక మూలాలు గట్టిగా ఉండటంతో గోల్డ్, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నదని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర ఒక్క శాతం బలపడి 4,530.72 డాలర్లకు చేరుకోగా, వెండి 75.52 డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నది.