న్యూఢిల్లీ, జనవరి 3: అంతర్జాతీయ మార్కెట్కు మరో దెబ్బ. వెనెజువెలాపై అగ్రరాజ్యం సైనిక దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయిప్పుడు. ఈ నేపథ్యంలోనే ముడి చమురు, బంగారం, వెండి తదితర కమోడిటీల ధరలకు రెక్కలు తొడుగుతాయన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే వెనెజువెలా ఆర్థిక వ్యవస్థ అంత పెద్దదేమీ కాదంటున్న ఆర్థిక నిపుణులు.. భారతీయ స్టాక్ మార్కెట్లపై ఈ భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండకపోవచ్చనే చెప్తున్నారు. అయినప్పటికీ గ్లోబల్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్, క్రూడాయిల్ ఇతర కమోడిటీ ట్రేడింగ్ తప్పక ప్రభావితం కాగలదని అభిప్రాయపడుతున్నారు.
ఇదీ సంగతి..
సోమవారం ఫ్యూచర్ మార్కెట్ కొమెక్స్లో గోల్డ్ ధర ఔన్స్ 4,380 డాలర్లను తాకవచ్చని, సిల్వర్ కూడా 75-78 డాలర్లను చేరవచ్చని యా వెల్త్ డైరెక్టర్ అనుజ్ గుప్తా అన్నారు. దీంతో స్పాట్ మార్కెట్లోనూ ఔన్స్ గోల్డ్ రూ.4,450 డాలర్లు, ఔన్స్ సిల్వర్ 80 డాలర్లు పలుకవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ఇక భారతీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్లోనూ బంగారం ధర 24 క్యారెట్ 10 గ్రాములు రూ.1,40,000గా నమోదు కావచ్చని, వెండి కిలో రూ.2,45,000ను తాకవచ్చన్నారు.
అమెరికా-వెనెజువెలా సంక్షోభం సముద్ర మార్గంలో ఇబ్బందులకు దారితీయవచ్చని, ఈ దారిగుండానే ప్రపంచంలోనే వెండి ఎగుమతుల్లో దూసుకుపోతున్న పెరు, చాద్ దేశాలు సిల్వర్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాయని మార్కెట్ నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఈ దెబ్బకు గోల్డ్ ధరలు కొండెక్కుతాయని అంటున్నారు. ఇదే జరిగితే దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పరుగుకు పట్టపగ్గాలనేవే ఉండకపోవచ్చు. ఇక ముడి చమురు విషయానికొస్తే.. ఎంసీఎక్స్పై బ్యారెల్ 5,200-5,300 డాలర్లను చేరే వీలుందన్నారు.