న్యూఢిల్లీ, ఏప్రిల్ 6 : బంగారం, వెండి ధరలు మళ్లీ ప్రియమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, డాలర్‌కు డిమాండ్ పడిపోవడంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు పుంజుకుంటున్నాయి. ఇదే క్రమంలో న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.2,300 లేదా 1.52 శాతం ఎగబాకి రూ.1,53,800కి చేరుకున్నది.
అలాగే కిలో వెండి రూ.5 వేలు ఎగబాకి రూ.2.42 లక్షలకు చేరుకున్నట్లు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. ఇటీవల కాలంలో తగ్గుతూ వచ్చిన బులియన్ ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయని, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగే అవకాశాలుండటం ఇందుకు కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,682.80 డాలర్లకు చేరుకోగా, వెండి 73.37 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.