న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్ హైకి చేరాయి. ఇటీవలికాలంలో గోల్డ్, సిల్వర్ రేట్లు క్రమేణా పెరుగుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం తులం పసిడి, కిలో వెండి విలువ మరో రూ.1,000 చొప్పున ఎగిశాయి. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా ఢిల్లీలో 99.9 స్వచ్ఛత (24 క్యారెట్) కలిగిన 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,05,670గా నమోదైంది. అలాగే కిలో వెండి రూ.1,26,000కు చేరిందని అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. కాగా, శనివారం ఒక్కరోజే రూ.6,000 ఎగబాకడం గమనార్హం. సాధారణ కొనుగోలుదారులతోపాటు పరిశ్రమ వర్గాల నుంచి పెరుగుతున్న డిమాండ్ ధరలు విజృంభించేలా చేస్తున్నదని వ్యాపారులు అంటున్నారు.
అంతర్జాతీయ కారణాలతోనే దేశీయంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నాయి. ఈ నెలలో వడ్డీరేట్లను అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తగ్గిస్తుందన్న అంచనాలు, విదేశీ మార్కెట్లలో పసిడికి పెరుగుతున్న డిమాండ్, స్టాక్ మార్కెట్ల నుంచి గోల్డ్ వైపునకు మదుపరుల పెట్టుబడులు మారుతుండటం వంటివి రేట్లను ఎగదోస్తున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం, భౌగోళిక-రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లు సైతం గోల్డ్ మార్కెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఇదిలావుంటే గ్లోబల్ స్పాట్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు 22.51 డాలర్లు పుంజుకొని 3,470.51 డాలర్లు పలికింది. వెండి ఔన్స్ 40.47 డాలర్లుగా ఉన్నది.
ఫ్యూచర్స్ మార్కెట్లోనూ రేట్లు ఎగిసిపడుతున్నాయి. దేశీయంగా మల్టీ ఎంసీఎక్స్‌పై అక్టోబర్ కాంట్రాక్ట్కుగాను తులం రూ.1,05,937గా నమోదైంది. డిసెంబర్‌కు రూ.1,06,539గా పలికింది. వెండి డిసెంబర్ కాంట్రాక్ట్కుగాను కిలో రూ.1,24,990గా ఉన్నది. ఇక అంతర్జాతీయంగా కోమెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో డిసెంబర్ కాంట్రాక్ట్ రికార్డు స్థాయిలో ఔన్స్ 3,556.87 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ 14 ఏండ్ల గరిష్ఠాన్ని తాకుతూ ఔన్స్ 41 డాలర్లు పలకడం విశేషం.
హైదరాబాద్‌లోనూ బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. 24 క్యారెట్ పసిడి రేటు తులం రూ.1,05,880గా నమోదైంది. ఈ ఒక్కరోజే రూ.930 పెరిగింది. అలాగే 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) ధర రూ.850 అందుకుని రూ.97,050 పలికింది. వరుసగా గత 6 రోజులుగా ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. 24 క్యారెట్ గోల్డ్ విలువ రూ.4,370 పెరిగింది. శనివారం ఒక్కరోజే 1,640 ఎగబాకడం విశేషం. 22 క్యారెట్ రేటూ రూ.3,550 ఎగిసింది. శనివారం రూ.1,500 పుంజుకున్నది.