Gold Rates | పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. ఇటీవల భారీగా పెరిగిన ధరలు వరుసగా దిగివస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లో బలహీనమైన డిమాండ్ కారణంగా మరోసారి బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల బంగారం బుధవారం బంగారం ధర రూ.300 తగ్గింది. దీంతో తులం ధర రూ.98,600 చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారంపై రూ.250 తగ్గి.. తులానికి రూ.98,050కి తగ్గింది. ఇదే సమయంలో వెండి ధర సైతం భారీగా దిగివచ్చింది. వెండి ధర రూ.1,100 తగ్గడంతో కిలో ధర రూ.1,03,100కి పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ స్వల్పంగా తగ్గి ఔన్స్‌కు 3,322.56కి చేరాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత భౌగోళిక రాజకీయ ఆందోళనలు తగ్గడంతో బంగారం డిమాండ్ తగ్గిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు (కమోడిటీస్) సౌమిల్ గాంధీ తెలిపారు. ఈ క్రమంలో బంగారం ధరలు రెండు వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయని చెప్పారు. ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్, రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది మాట్లాడుతూ ఇతర అంశాలపై దృష్టి సారిస్తున్నారన్నారు. అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మార్కెట్ దృష్టి పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, పెరుగుతున్న భౌగోళిక రాజకీయాలపై ఉంటుందన్నారు. ఈ అంశాలు సురక్షితమైన పెట్టుబడులకు డిమాండ్‌ను పెంచడమే కాకుండా ముడి చమురు ధరలపై కూడా ఒత్తిడిని కలిగిస్తాయన్నారు.