న్యూఢిల్లీ, జూలై 16: బంగారం మరింత చౌకైంది. గరిష్ఠ స్థాయికి ధర చేరుకోవడంతో అమ్మకాలు పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్టాకిస్టులు విక్రయాలకు మొగ్గుచూపడంతో దేశీయంగా ధరలు భారీగా పడిపోయాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల పుత్తడి ధర రూ.500 తగ్గి రూ.99 వేల దిగువకు జారుకున్నది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి తులం ధర రూ.98,870 వద్ద నిలిచింది. వరుసగా రెండు రోజులుగా ధరలు తగ్గుతుండటం విశేషమని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర మరో రూ.400 తగ్గి రూ.98,400కి దిగొచ్చింది. ఇటు హైదరాబాద్లో 24 క్యారెట్ తులం బంగారం ధర రూ.490 తగ్గి రూ.99,280కి చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.99,700గా ఉన్నది. 22 క్యారెట్ ధర కూడా రూ.450 తగ్గి రూ.91 వేలుగా నమోదైంది. కానీ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఔన్స్ గోల్డ్ 16.41 డాలర్లు ఎగబాకి 3,341.37 డాలర్లకు చేరుకున్నది. ప్రతీకార సుంకాల విధింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో గ్లోబల్ మార్కెట్లో వీటి ధరలు బలపడ్డాయని కొటక్ సెక్యూరిటీస్ వైస్ స్రెసిడెంట్ కయాంత్ చైనావాలా తెలిపారు.
బంగారంతో పాటు వెండి ధరలు భారీగా తగ్గాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో కిలో వెండి ఏకంగా రూ.1,000 తగ్గింది. మంగళవారం రూ.1.12 లక్షలుగా ఉన్న కిలో ధర ప్రస్తుతం రూ.1.11 లక్షలకు తగ్గింది. ఈవారంలోనే రికార్డు స్థాయి రూ.1.15 లక్షలు పలికిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో కిలో వెండి రూ.1,000 తగ్గి రూ.1.24 లక్షలకు తగ్గింది.