Gold-Silver Price | బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. గురువారం సైతం ధర తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గిన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రూ.150 తగ్గి తులం రూ.1,00,560కి చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధ్రువీకరించింది. అలాగే, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.150 తగ్గి తులం రూ.99,800 పలుకుతోందని పేర్కొంది. మరో వైపు వెండి ధర సైతం భారీగా పతనమైంది. రూ.1000 తగ్గి కిలోకు రూ.1,07,200కి చేరుకుంది. ప్రపంచ మార్కెట్లలో స్పాట్ బంగారం స్వల్పంగా తగ్గి ఔన్సుకు 3,365.90 డాలర్లకు చేరింది. అదే సమయంలో స్పాట్ వెండి ఒక శాతం తగ్గి ఔన్సుకు 36.37 డాలర్లకు పడిపోయింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ ఏపీవీ కైనత్ చైన్వాలా తెలిపారు.
ఈ నిర్ణయం తర్వాత యూఎస్ డాలర్ బలంగా ఉన్నది. అయితే, బంగారం ధరలు ఔన్సుకు 3,390 డాలర్లకు తగ్గాయి. వడ్డీ రేట్లు తగ్గుతాయని అంచనా వేసినా.. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సవరించేందుకు అంగీకరించలేదు. అయితే, యూఎస్ ద్రవ్య విధానానికి సంబంధించిన ఆర్థిక అంచనాలను మాత్రం సవరించింది. జూన్ టీన్త్ (యునైటెడ్ స్టేట్స్లో ఫెడరల్ హాలీడే) సందర్భంగా యూఎస్ మార్కెట్లు, బ్యాంకులు గురువారం మూతపడనున్నాయి. యూఎస్ ఫెడరల్ వైఖరి నేపథ్యంలో మార్కెట్లో బంగారం హెచ్చుతగ్గులకు గురైందని ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్, పరిశోధన విశ్లేషకుడు జతిన్ త్రివేది పేర్కొన్నారు. యూఎస్ వడ్డీ రేటు తగ్గింపు మరో ఆరు నెలలు వాయిదా పడిందని.. అయినా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ ఉందని అభిప్రాయపడ్డారు. ఇక హైదరాబాద్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల ధర రూ.92,650 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.1,01,080 పలుకుతోందని చెప్పింది. ఇక వెండి ధర కిలోకు రూ.1.22 లక్షలు పలుకుతున్నది.