న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: ప్రపంచంలో అత్యంత సురక్షిత పెట్టుబడి సాధనం ఇప్పుడు ఏమైనా ఉందా? అంటే బంగారమేనన్న సమాధానం అంతటా వినిపిస్తున్నది. భారత్ సహా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున పోగేస్తున్న పసిడి నిల్వలే ఇందుకు ఉదాహరణ అని చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో ప్రపంచ వాణిజ్య స్వరూపమే మారిపోయింది. దీంతో అన్ని దేశాలూ తమ ఆర్థిక వ్యవస్థల రక్షణార్థం గోల్డ్ రిజర్వ్‌లను పెంచుకుంటూపోతున్నాయని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) చెప్తున్నది. మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, ఆయా దేశాల యుద్ధాలు పరిస్థితుల్నీ ఇంకా దిగజార్చుతున్నాయి.
ఇవి దేశ జీడీపీలను, కరెన్సీలను కూలదోస్తున్నాయి. ఈ క్రమంలోనే మునుపు అమెరికా బాండ్లను భారీగా కొన్న ఆర్బీఐ.. ఇప్పుడు వాటిని తగ్గించుకునే పనిలో పడింది. ఈ ఏడాది జూన్ నాటికి 227 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. ఏడాది క్రితం ఇవి 242 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం. ఇక చమురు దిగుమతులపైన ఆధారపడినందున భారత్‌కు విదేశీ మారకపు నిల్వలతో చాలా అవసరమే ఉన్నది. అయితే డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయి కనిష్ఠాలకు దిగజారుతుండటంతో ఆర్బీఐపై ఒత్తిడి పెరుగుతున్నది. దీన్ని తగ్గించుకోవడానికి బంగారమే ప్రత్యామ్నాయంగా మారుతున్నదని ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం.
ఇటీవలి ప్రపంచ స్వర్ణ మండలి వివరాల ప్రకారం.. 43 శాతం సెంట్రల్ బ్యాంకులు తమ పసిడి నిల్వలను మరింత పెంచుకునే యోచనలోనే ఉన్నట్టు తేలింది. అమెరికాపై రుణ భారం గరిష్ఠంగా 37 ట్రిలియన్ డాలర్లకుపైగా ఉండటంతో ఇప్పుడు ఆ దేశ ప్రభుత్వ బాండ్లకు ఆదరణ క్షీణిస్తున్నది. పైగా ప్రెసిడెంట్ ట్రంప్ తీరు ఆ దేశ రాజకీయ అనిశ్చితికీ దారితీసే ప్రమాదం ఉండటంతో యూఎస్ డాలర్ బాండ్లకు గిరాకీ సన్నగిల్లింది. 75 శాతం సెంట్రల్ బ్యాంకులు వచ్చే ఐదేండ్లలో అమెరికా డాలర్ నిల్వల స్థానంలో గోల్డ్ రిజర్వ్లుంటాయని చెప్తుండటం గమనార్హం.
ఫలితంగా పుత్తడిపైనే అన్ని దేశాలు దృష్టి పెడుతున్నాయి. ఇక స్టాక్ మార్కెట్లూ అల్లకల్లోలంగానే ఉంటున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను గోల్డ్ వైపునకే మళ్లిస్తున్నారు. ఈ కారణంగానే ఆల్‌టైమ్ హై రికార్డుల్లో బంగారం ధరలు కదలాడుతున్నాయి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాములు దాదాపు 1.14 లక్షలు పలుకుతున్న విషయం తెలిసిందే. దీంతో గోల్డ్‌కు ఆదరణ ఎప్పటికీ తగ్గదన్న అభిప్రాయాలైతే బలంగా నెలకొన్నాయి. మొత్తానికి ట్రంప్ సుంకాలతో వాణిజ్య యుద్ధం మొదలైతే సెంట్రల్ బ్యాంక్‌లు పసిడి కొనుగోళ్లను ఇంకా పెంచవచ్చన్న అంచనాలే గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ధరలు పరుగులు పెట్టడం ఖాయమనే చెప్పాలి.