న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రెండంకెల్లో జీడీపీ వృద్ధిని సాధించి, ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా స్థానం దక్కించుకున్న భారత్ మున్ముందు మందగిస్తుందని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తాజాగా విడుదల చేసిన రీసెర్చ్ నోట్లో పేర్కొంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేసి, వడ్డీ రేట్లను అధికంగా పెంచడం అమెరికాకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హాని చేకూరుస్తుందని బీవోబీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
దీంతో భారత్ వంటి అభివృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థలు, ఇతర వర్థమాన దేశాల్లో వృద్ధి దెబ్బతింటుందన్నారు. అమెరికాలో అధిక వడ్డీ రేట్లతో డాలరు పెరుగుతుందని, ఈ కారణంగా వర్థమాన దేశాల కరెన్సీలు క్షీణిస్తాయన్నారు. వృద్ధి దెబ్బతిన్నా, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వేగంగా వడ్డీ రేట్లను పెంచనున్న సంకేతాల్ని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ ఇప్పటికే వెల్లడించారు. ఫలితంగా మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతున్నాయి. బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయి.
పొవెల్ వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా పదేండ్ల బాండ్ ఈల్డ్స్ ఆగస్టు నెలలో భారీగా 54 బేసిస్ పాయింట్లు పెరిగాయని, ఇండియాలో మాత్రం ఈ బాండ్ల ఈల్డ్స్ 13 బేసిస్ పాయింట్లు తగ్గాయని బీవోబీ నోట్ తెలిపింది. క్రూడ్ ధరలు తగ్గడంతో భారత్‌లో ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న అంచనాలే ఇందుకు కారణమన్నది.
దేశంలో ద్రవ్యోల్బణం ఇప్పటికే గరిష్ఠాన్ని చూసిందని, రానున్న నెలల్లో ఇది పెరగబోదన్న అంచనాల్ని రిజర్వ్‌బ్యాంక్ వెల్లడించడం కూడా ఈల్డ్స్‌కు మద్దతునిచ్చాయి. ఆగస్టు నెలలో భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం వృద్ధి 6.7 శాతం ఉంటుందని బీవోబీ విశ్లేషకులు అంచనా వేశారు.
ఫెడ్ కఠిన వైఖరితో భారత్ కరెన్సీ తీవ్ర ఒత్తిడికి లోనయ్యింది. ఒకదశలో రూపాయి మారకపు విలువ 80 డాలర్ మార్క్‌ను దాటేసింది. ఆర్బీఐ డాలర్లను విక్రయించడంతో ఆ స్థాయి నుంచి రూపాయి కోలుకున్నప్పటికీ, భవిష్యత్తులో బలహీనంగానే కదులుతుందని బీవోబీ అంచనా వేసింది.
డాలర్ పటిష్టంగా ఉండటం, ఎగుమతుల వృద్ధి సన్నగిల్లడం ఇందుకు కారణమన్నది. అమెరికాలో అధిక వడ్డీ రేట్ల కారణంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు తిరిగి భారత్ నుంచి నిధుల్ని తరలించుకుపోతారని, ఇది కూడా రూపాయిని ఒత్తిడికి లోను చేస్తుందని రిపోర్ట్ తెలిపింది. సమీప భవిష్యత్తులో రూపాయి 79.75-80 మధ్య ట్రేడవుతుందని విశ్లేషకులు అంచనా వేశారు.