నేడు వైద్య ఖర్చులు ఏ స్థాయిలో పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరికీ ఆరోగ్య బీమా తప్పనిసరి అంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం.. మీ కుటుంబ భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టినట్టే. ఇక గతంతో పోల్చితే ప్రస్తుతం అందుబాటులో ఉంటున్న ఆరోగ్య బీమా పాలసీలు.. కేవలం దవాఖానల్లో చేరికలకేగాక, ఓపీడీ సంప్రదింపులు, టెలీ మెడిసిన్, ముందస్తు వైద్య పరీక్షలు, ప్రసూతి, మానసిక, రిహాబిలిటేషన్, ఇతర ఆరోగ్య సంరక్షణ సేవల్నీ అందిస్తుండటం విశేషం. నిజానికి మారిన జీవనశైలితో ఇప్పుడు చాలామంది వయసుతో సంబంధం లేకుండా షుగర్, బీపీ సమస్యల్ని ఎదుర్కొంటున్నారు.
గుండె-కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రమాదాలబారిన కూడా పడుతున్నారు. దీంతో ఇలాంటివారికి ఆరోగ్య బీమా, ప్రధానంగా క్రిటికల్ ఇల్నెస్ రైడర్లుండే పాలసీల అవసరం చాలా ఉంటున్నది. ఇలాంటి కవరేజీలను ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్సహా అనేక సంస్థలు ప్రభావవంతంగా అందిస్తున్నాయి. పైగా ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమా కోసం చెల్లించే ప్రీమియంలపై పన్ను మినహాయింపులనూ అందుకోవచ్చు.
60 ఏండ్లలోపువారికి ఏటా రూ.25,000దాకా, ఆపై వయసున్న సీనియర్ సిటిజన్లకు రూ.50,000 వరకు పన్ను మినహాయింపులను పొందవచ్చని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఈ ఉగాదితో మొదలైన కొత్త ఏడాదిలో ఆరోగ్య బీమా ఆవశ్యకతను గుర్తించి ఓ సానుకూల నిర్ణయం తీసుకోండి. ఒకవేళ ఇప్పటికే ఆరోగ్య బీమా ఉన్నైట్టెతే.. సమగ్ర కవరేజీలుండే, ఇంటిల్లిపాదికి అవసరమయ్యే మరింత మెరుగైన బీమాను కొనడం ఉత్తమం.