ముంబై/న్యూఢిల్లీ, జనవరి 7: ఈ ఏడాది ఏప్రిల్‌తో మొదలయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) దేశ జీడీపీ వృద్ధిరేటు తగ్గిపోవచ్చని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్లు తగ్గకపోవచ్చంటూ ప్రముఖ విదేశీ బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) భారత ఆర్థిక వృద్ధిరేటు 7.3 శాతంగా నమోదు కావచ్చని అంచనాలున్న నేపథ్యంలో రాబోయే ఆర్థిక సంవత్సరం మాత్రం దీనికి అర శాతం దిగజారి 6.8 శాతానికే పరిమితమయ్యే ఆస్కారం ఉందని గోల్డ్‌మన్ సాచ్స్ చెప్తుండటం గమనార్హం. అలాగే ఈ ఏడాది (2026)కైతే దేశ జీడీపీ వృద్ధిరేటు 6.7 శాతంగా ఉండొచ్చంటూ ఓ తాజా నివేదికలో పేర్కొన్నది.
మున్ముందు ద్రవ్యోల్బణం విజృంభిస్తుందని గోల్డ్‌మన్ సాచ్స్ హెచ్చరించింది. ఈ ఏడాది ప్రధాన ద్రవ్యోల్బణం 3.9 శాతంగా నమోదు కావచ్చన్నది. ఇది ద్రవ్యోల్బణం 4 శాతాన్ని మించకూడదన్న ఆర్బీఐ లక్ష్యానికి చాలా దగ్గరగా ఉన్నది. ఈ క్రమంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరం ద్రవ్య పరపతి విధాన సమీక్షల్లో ఆర్బీఐ కఠిన వైఖరినే అవలంబించే వీలుందన్నది. దీంతో వడ్డీరేట్ల కోతలకు పరిమిత అవకాశాలేనని అభిప్రాయపడింది. పెరుగుతున్న ధరలను కట్టడి చేసేందుకు కీలక వడ్డీరేట్ల జోలికి వెళ్లకుండానే ద్రవ్య సమీక్షల్ని ఆర్బీఐ ముగించవచ్చని చెప్పింది. ప్రస్తుతం ఆర్బీఐ రెపోరేటు 5.25 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే నెల జరిగే ద్వైమాసిక ద్రవ్య సమీక్షలో ఆర్బీఐ రెపోరేటును అలాగే ఉంచుతుందా? లేదా కోత పెడుతుందా? అన్నది మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నదిప్పుడు. అయితే జీడీపీని బలపర్చాలనే కోణంలో రెపోరేటును పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) తగ్గించే వీలుకూడా లేకపోలేదని గోల్డ్‌మన్ సాచ్స్ చెప్తున్నది.
ఈ ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ వృద్ధిరేటు 7.4 శాతంగా నమోదు కావచ్చని బుధవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. తయారీ, సేవల రంగాల ప్రదర్శన బాగుందని, అందుకే గత ఆర్థిక సంవత్సరం (2024-25) జీడీపీ 6.5 శాతంతో పోల్చితే దాదాపు 1 శాతం పుంజుకోవచ్చన్న ఆశాభావాన్ని గణాంకాలు, కార్యాచరణ అమలు మంత్రిత్వ శాఖ జాతీయ ఆదాయంపై ఇచ్చిన ముందస్తు తొలి అంచనాలో వెలిబుచ్చింది. తయారీ, నిర్మాణ రంగాల్లో వృద్ధిరేటు 7 శాతంగా ఉండొచ్చన్నది. అయితే వ్యవసాయ, దాని అనుబంధ రంగాలు, విద్యుత్తు, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవా రంగాల్లో స్వల్ప వృద్ధికే అవకాశాలున్నట్టు అభిప్రాయపడింది. ఇక రాబోయే బడ్జెట్ కూర్పునకు ఈ అంచనాలను మోదీ సర్కార్ వాడుతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను పార్లమెంట్లో ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రకటించనున్న విషయం తెలిసిందే.
దేశ ఆర్థిక వృద్ధికి ఎంతగానో దోహదం చేసే కొత్త పెట్టుబడులు.. గత కొన్నేండ్లుగా నిరాశాజనకంగా ఉంటున్నాయి. దీనికితోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల సెగ.. భారత్‌కు తగులుతున్నది. ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాలను ఆలస్యం చేస్తున్నందుకు, రష్యా నుంచి ముడి చమురు దిగుమతుల్ని కొనసాగిస్తున్నందుకు.. ఇలా రెండు రకాలుగా అగ్రరాజ్యాధినేత టారిఫ్‌లతో బాదుతున్నారు. ఇటీవలే భారత్‌పై తమ సుంకాలు ఇంకా పెరుగుతాయని కూడా హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో భవిష్యత్తు ఇబ్బందికరంగానే ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ బలపడితే కొంతలో కొంత భారత్‌కు ఊరట కలుగవచ్చని, అయితే అమెరికాతో భారత్ కుదుర్చుకునే వాణిజ్య ఒప్పందంపైనే ఇది ఆధారపడి ఉందని గోల్డ్‌మన్ సాచ్స్ స్పష్టం చేసింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తక్కువగానే ఉన్నందున.. భారత కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) 2026లో 1 శాతంగానే ఉండవచ్చని అంచనా వేసింది.