Growth Rate | న్యూఢిల్లీ, నవంబర్ 29: దేశ ఆర్థిక వృద్ధిరేటు దాదాపు రెండేండ్ల కనిష్ఠానికి దిగజారింది. శుక్రవారం విడుదలైన జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) వివరాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో జీడీపీ 5.4 శాతానికే పరిమితమైంది. 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 4.3 శాతంగా నమోదైంది. మళ్లీ ఆ దరిదాపుల్లో వృద్ధి గణాంకాలుండటం ఇప్పుడే. కాగా, తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో ఇది 6.7 శాతంగా ఉంటే.. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 8.1 శాతంగా ఉండటం గమనార్హం. దీంతో కాలం గడుస్తున్నకొద్దీ వృద్ధిరేటు అంతకంతకూ పడిపోతున్న సంకేతాలే కనిపిస్తున్నాయి.
తయారీ, గనుల రంగాల పనితీరు నిరాశాజనకంగా ఉన్నట్టు తాజా గణాంకాల్లో తేలింది. తయారీ రంగ కార్యకలాపాలు 2.2 శాతానికి, గనుల రంగంలో ఉత్పాదకతైతే 0.01 శాతానికి క్షీణించాయి. ఏడాది క్రితం ఇవి వరుసగా 14.3 శాతంగా, 11.1 శాతంగా ఉండటం విశేషం. రియల్టీ తదితర రంగాల్లో వృద్ధి పెరిగినా అది స్వల్పమే. ఇక వినియోగదారుల కొనుగోలు శక్తి సైతం పడిపోయినట్టు స్పష్టమవుతున్నది. ఈ ఏప్రిల్-జూన్‌లో 7.4 శాతంగా ఉంటే, జూలై-సెప్టెంబర్‌లో 6 శాతంగానే ఉన్నది. దేశ జీడీపీ బలంగా ఉండాలంటే మార్కెట్లో డిమాండ్ ముఖ్యం. కానీ వినిమయ శక్తి తగ్గిపోతే డిమాండ్ కూడా ఉండదు.
జీడీపీ కంప్యూటేషన్ కోసం బేస్ ఇయర్‌ను 2022-23కు మార్చాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు యోచిస్తున్నది. అంతా కుదిరితే 2026 ఫిబ్రవరి నుంచి ఇది అమల్లోకి రావచ్చంటున్నారు. బేస్ ఇయర్ మారితేనే దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి సంబంధించి కచ్ఛితమైన సమాచారం వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కాగా, ప్రస్తుతం 2011-12 బేస్ ఇయర్‌గా ఉన్నది. ఈ సంవత్సరంలోని ధరల ఆధారంగానే వృద్ధిరేటును లెక్కిస్తున్నారు. గతంలో ఇది 2004-05గా ఉండేది. ఇదిలావుంటే వచ్చే జనవరి నుంచి నెలనెలా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అంచనాలుంటాయని కేంద్ర గణాంకాలు, ప్రణాళిక అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సౌరభ్ గార్గ్ తెలిపారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరానికిగాను అక్టోబర్ నెల ముగిసే నాటికి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక లోటు పూర్తి ఏడాదికాల లక్ష్యంలో 46.5 శాతంగా నమోదైంది. ప్రభుత్వ ఆదాయ-వ్యయాల మధ్య వ్యత్యాసాన్నే ఆర్థిక లోటుగా పరిగణిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దీన్ని రూ.16,13,312 కోట్లకు కట్టడి చేయాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే తొలి ఏడు నెలల్లో రూ.7,50,824 కోట్లకు వచ్చింది.
రెండో త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 5.4 శాతానికి క్షీణించడం అసంతృప్తికరమే. అయినప్పటికీ మొత్తం ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న 6.5 శాతం లక్ష్య సాధనకు వచ్చిన ముప్పేమీ లేదు.
జూలై-సెప్టెంబర్‌లో జీడీపీ వృద్ధిరేటు ఊహించినదానికంటే బాగా తగ్గిపోయింది. కీలక రంగాల్లో నిస్తేజం కనిపించింది. తయారీ, గనుల రంగాల్లో ఉత్పాదకత రేటు మరీ దారుణంగా నమోదైంది.
బొగ్గు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్తు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తుల రంగాల్లో ఉమ్మడి వృద్ధిరేటు ఈ ఏడాది అక్టోబర్ నెలలో క్షీణించింది. 3.1 శాతంగానే ఉన్నట్టు తాజా అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో ఈ 8 కీలక రంగాల ఉత్పాదకతలో వృద్ధిరేటు 12.7 శాతంగా నమోదు కావడం గమనార్హం. ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి క్షీణించినట్టు స్పష్టమైంది. కాగా, ఈ ఏప్రిల్-అక్టోబర్ మధ్య ఈ రంగాల వృద్ధిరేటు 4.1 శాతం వద్దే ఆగిపోయింది. నిరుడు ఇదే వ్యవధిలో 8.8 శాతంగా ఉన్నది. దేశ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ 8 రంగాల వాటా 40.27 శాతంగా ఉండగా, వీటి పనితీరు ఐఐపీని గట్టిగానే ప్రభావితం చేస్తుంది.