ముంబై, ఆగస్టు 27: దేశంలో ఉద్యోగార్థుల తొలి ప్రాధాన్యం ఐటీ కొలువులే. లక్షల్లో జీతాలొస్తాయి మరి. అయితే ఈ ట్రెండ్ మారుతోందిప్పుడు. అవును.. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ)లో ఐటీ సంస్థల కంటే 20 శాతం వరకు ఎక్కువ వేతనాలుంటున్నాయి. ప్రారంభ, మధ్యశ్రేణి ఉద్యోగులకైతే డిమాండ్ అధికంగా ఉండటం గమనార్హం. మంగళవారం టీమ్‌లీజ్ డిజిటల్ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో ప్రస్తుతం 1,600లకుపైగా జీసీసీలున్నాయి. వీటిలో 16.6 కోట్లకుపైగా ప్రొఫెషనల్స్ పనిచేస్తున్నారు.
ఇక ఆకర్షణీయమైన జీతభత్యాలు వస్తుండటంతో ఇప్పుడు జాబ్ మార్కెట్లో జీసీసీలే హాట్ ఫేవరేట్‌గా ఉంటున్నాయి. ప్రతిభావంతులను ఒడిసి పట్టుకోవడానికి ఐటీ కంపెనీలతో పోల్చితే సగటున 12-20 శాతం ఎక్కువగా జీసీసీలు సాలరీలను ఆఫర్ చేస్తున్నట్టు టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో నీతి శర్మ తెలిపారు. ఫ్రెషర్స్‌కూ బంపర్ ప్యాకేజీలు దక్కుతున్నట్టు చెప్తున్నారు.
గత కొన్నేండ్ల నుంచి దేశంలో జీసీసీలు పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చే 5-6 ఏండ్లలో 800 కొత్త జీసీసీలు రాబోతున్నాయని తెలుస్తున్నది. దీంతో ఉద్యోగులకు మరింత డిమాండ్ ఏర్పడనుందంటున్నారు జాబ్ మార్కెట్ విశ్లేషకులు. గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా భారత్ మారిందని, ఇక్కడి అనుకూలతలు, పరిమితంగా ఉండే ఖర్చులు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, వ్యాపారావకాశాలు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహళజాతి సంస్థలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఐటీ, ఫైనాన్స్, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో ఉన్నవారికి ప్రాధాన్యత ఏర్పడుతున్నదని వివరిస్తున్నారు.
జీసీసీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఇప్పటికే మహిళల వాటా 25 శాతంగా ఉన్నది. 2027కల్లా ఇది 35 శాతానికి పెరుగవచ్చని అంచనా. ఇక జీసీసీల్లో పైటార్చ్, ఏడబ్ల్యూఎస్, డెవోప్స్, ఎన్ఎల్పీ, కుబేర్నెట్స్, హైపర్‌లెడ్జర్ ఫ్యాబ్రిక్, బ్లాక్‌చైన్, టాబ్లూ, ఎస్‌క్యూఎల్, సర్వీస్‌నౌ టెక్నాలజీల్లో ప్రవేశమున్నవారికి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని ‘డిజిటల్ స్కిల్స్ అండ్ సాలరీ ప్రైమర్ ఫర్ 2024-25’ పేరిట విడుదలైన రిపోర్టులో టీమ్‌లీజ్ డిజిటల్ పేర్కొన్నది. జీసీసీలు, ఐటీ సేవలు, ఐటీయేతర రంగాల్లో ట్రెండ్ ఆధారంగా ఈ నివేదిక తయారైంది. రకరకాల కొలువులపై విశ్లేషణలు చేసినట్టు టీమ్‌లీజ్ ఈ సందర్భంగా తెలియజేసింది.
కోల్‌కతా, అహ్మదాబాద్, వడోదర వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో విస్తరణపై జీసీసీలు ఆసక్తి కనబరుస్తున్నట్టు తాజా నివేదికలో తేలింది. ఇప్పటిదాకా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి ప్రథమ శ్రేణి నగరాల్లో ఏర్పాటుపైనే జీసీసీ నిర్వాహకులు దృష్టి సారించిన సంగతి విదితమే. దీంతో ఈ పరిణామం దేశీయంగా టెక్ అవకాశాల్లో చోటుచేసుకుంటున్న భౌగోళిక వైరుధ్యానికి అద్దం పడుతున్నట్టు టీమ్‌లీజ్ అభిప్రాయపడింది. ఇదిలావుంటే 10 ఏండ్లలోపు అనుభవం ఉన్నవారికి జీసీసీల్లో ఎక్కువ అవకాశాలు వస్తున్నట్టు స్పష్టమైంది.
ఇక వచ్చే ఐదేండ్లలో ఐటీ ఉత్పత్తులు, సేవా రంగాల్లో 25-30 శాతం మేర పెట్టుబడులు పెరిగేందుకు వీలుందని కూడా తాజా రిపోర్టు వెల్లడించింది. 2026కల్లా దేశ జీడీపీలో ఈ రెండు రంగాల వాటా 8 శాతంగా ఉండొచ్చని అంటున్నారు. క్లౌడ్ సొల్యూషన్స్ రాకతో 1.4 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి రావచ్చన్న అంచనాలూ వినిపిస్తున్నాయి.