Gautam Adani | సౌర విద్యుత్ ప్రాజెక్టులను దక్కించుకోవడానికి పలు రాష్ట్రాల అధికారులకు అదానీ గ్రూప్ లంచం ఇవ్వడానికి ప్రయత్నించిందని వచ్చిన ఆరోపణలు గురువారం అదానీ గ్రూప్ సంస్థల షేర్లు భారీగా పతనం అయ్యాయి. ట్రేడింగ్ మొదలైన కొద్ది సేపటికే అదానీ గ్రూపునకు సంస్థల షేర్లు భారీగా నష్టపోవడంతో గౌతం అదానీ వ్యక్తిగత సంపద రూ.1,04,784.77 (12.4 బిలియన్ డాలర్లు) కోట్లు కోల్పోయింది. 2023లో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వెలుగు చూసిన తర్వాత గౌతం అదానీ వ్యక్తిగత సంపద ఇంత భారీగా పతనం కావడం ఇదే మొదటి సారి.
అదానీ గ్రూపు సంస్థల షేర్లు భారీగా నష్టపోయాయి. అత్యధికంగా అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్ 23 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 20 శాతం నష్టపోయాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 18 శాతం, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ 13 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 10 శాతం, అదానీ విల్మార్ 10 శాతం, అదానీ సిమెంట్స్ 12 శాతం, అదానీ పవర్ తొమ్మిది శాతం, ఏసీసీ సిమెంట్ 7.92 శాతం పతనం అయ్యాయి. దీంతో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.2.5 లక్షల కోట్లు హరించుకుపోయింది.
ప్రపంచ బిలియనీర్లలో గౌతం అదానీ ఒకరు. ఆయన వ్యక్తిగత సంపద 69.8 బిలియన్ డాలర్లు ఉంటుందని భావిస్తున్నారు. కానీ అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలతో ఒక్కరోజే సుమారు 12.4 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదను గౌతం అదానీ కోల్పోయారు. ప్రస్తుతం ఆయన వ్యక్తిగత సంపద 57.5 బిలియన్ డాలర్లకు చేరింది. గురువారం మధ్యాహ్నం 12.40 గంటల సమయానికి ఫోర్బ్స్ బిలియనీర్ల సూచీలో 22వ స్థానంలో ఉన్న గౌతం అదానీ ఇప్పుడు 25వ స్థానానికి పడిపోయారు.