హైదరాబాద్, జూన్ 13: గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్.. మరో సంస్థను హస్తగతం చేసుకున్నది. అదానీ గ్రూప్‌నకు చెందిన అంబుజా సిమెంట్ గురువారం పెన్నా సిమెంట్‌ను పూర్తిగా కొనేసింది. కంపెనీ విలువను రూ.10,422 కోట్లుగా లెక్కగట్టి ఈ లావాదేవీని జరిపింది. ఈ మేరకు అంబుజా సిమెంట్ బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)కు తెలియజేసింది. నగదు రూపంలోనే డీల్ ఉన్నట్టు తెలుస్తున్నది. కాగా, పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (పీసీఐఎల్)తో బైండింగ్ అగ్రిమెంట్‌పై సంతకాలు జరిగాయని చెప్పింది. దీంతో పీసీఐఎల్ 100 శాతం వాటాలు దాని ప్రస్తుత ప్రమోటర్ గ్రూప్, పీ ప్రతాప్ రెడ్డి, ఆయన కుటుంబం నుంచి అంబుజా చేతికి రానున్నాయి. ఇక ఈ డీల్‌తో పెన్నా డీలర్లంతా అంబుజా సిమెంట్ మార్కెట్ నెట్‌వర్క్‌లోకి వస్తున్నారు.
పెన్నా సిమెంట్ కొనుగోలుతో అదానీ గ్రూప్ దక్షిణాది మార్కెట్ షేర్ మరో 8 శాతం పెరిగింది. ఇప్పటికే అంబుజా, ఏసీసీ సిమెంట్లతో దేశవ్యాప్తంగా సిమెంట్ ఇండస్ట్రీలో బలమైన కార్పొరేట్ శక్తిగా గౌతమ్ అదానీ ఎదిగారు. అయినప్పటికీ భారత్‌లో అల్ట్రాటెక్ తర్వాతి స్థానంలోనే ఉండిపోయారు. ఈ క్రమంలో పెన్నా సిమెంట్ డీల్.. దేశీయ సిమెంట్ పరిశ్రమలో అదానీ వాటాను ఇంకో 2 శాతం పెంచింది. నిజానికి భారతీయ సిమెంట్ ఇండస్ట్రీలో అగ్రస్థానంపైనే అదానీ కన్నేశారు. ఇందు కోసం 3 బిలియన్ డాలర్ల (రూ.25,000 కోట్లు)తో ఓ నిధిని కూడా పక్కకు పెట్టుకున్నారు. ఇక పీసీఐఎల్కు వ్యూహాత్మక ప్రాంతాల్లోనే ప్లాంట్లున్నాయి. దీనికి కావాల్సినంత సున్నపురాయి నిల్వలూ ఉన్నాయి. ఫలితంగా డిమాండ్‌కు తగ్గ సిమెంట్‌ను ఉత్పత్తి చేయడానికి పుష్కలంగా అవకాశాలున్నాయని అదానీ గ్రూప్ చెప్తున్నది.
భారతీయ సిమెంట్ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతున్నది. ఈ నేపథ్యంలోనే రాబోయే ఐదేండ్లకుపైగా కాలంలో వార్షిక చక్రవృద్ధి రేటు (సీఏజీఆర్) 7 నుంచి 8 శాతంగా ఉండొచ్చని అదానీ గ్రూప్ అంచనా వేస్తున్నది. దేశవ్యాప్తంగా రైల్వే సైడింగ్స్, క్యాపిటివ్ పవర్ ప్లాంట్లు, వేస్ట్ హీట్ రికవరీ సిస్టమ్స్‌తోపాటు సాగునీటి ప్రాజెక్టులు, నివాస సముదాయాలు, రహదారుల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే చిన్న, పెద్ద సిమెంట్ కంపెనీలను చేజిక్కించుకోవాలని అదానీ గ్రూప్ ప్రయత్నిస్తున్నది. తద్వారా మార్కెట్లోనూ ఆధిపత్యం కొనసాగించాలనుకుంటున్నది. అంబుజా, ఏసీసీ, సంఘీ ఇండస్ట్రీస్‌ల వార్షిక ఉత్పాదక సామర్థ్యం ఇప్పుడు 78.9 మిలియన్ టన్నులుగా ఉన్నది. దేశవ్యాప్తంగా వీటికి 18 ప్లాంట్లు, 19 గ్రైండింగ్ యూనిట్లున్నాయి. తాజాగా పెన్నా సిమెంట్నూ పొందడంతో మొత్తం అదానీ గ్రూప్ ఆధ్వర్యంలోని సిమెంట్ సంస్థల వార్షిక ఉత్పాదక సామర్థ్యం 89 మిలియన్ టన్నులకు చేరుతున్నది. అలాగే కోల్‌కతా, గోపాల్పూర్, కరైకల్, కొచ్చి, కొలంబోల్లోని బల్క్ సిమెంట్ టర్మినల్స్‌తో అదానీ సిమెంట్ సముద్ర రవాణా సామర్థ్యం బలపడింది.
అంబుజా సిమెంట్ వృద్ధిదాయక ప్రయాణంలో పెన్నా సిమెంట్ కొనుగోలు కీలక మైలురాయి. ఈ డీల్‌తో దేశంలో మా సిమెంట్ వ్యాపారం మరింత విస్తరించడమేగాక, బలపడినైట్టెంది. విలు వ, ఉత్పత్తిపరంగా పీసీఐఎల్ను అత్యంత పోటీయుత సంస్థగా తీర్చిదిద్ది, దాని పనితీరును మెరుగుపర్చడమే మా లక్ష్యం.
-అజయ్ కపూర్, అంబుజా సిమెంట్ సీఈవో