Gautam Adani : ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీ మళ్లీ 100 బిలియన్ డాలర్ల క్లబ్బులో చేరారు. ఒక పక్క మార్కెట్లో అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. అదానీ సంపద మాత్రం పెరుగుతుండటం విశేషం. ప్రపంచ సంపన్నుల జాబితాలో నిత్యం ఉండే అదానీ.. ఇప్పుడు వారిలో 100 బిలియన్ డాలర్ల క్లబ్బులో చేరారు. బ్లూమ్‌బర్గ్ సంస్థ విడుదల చేసిన బిలియనీర్స్ ఇండెక్స్‌లో గౌతమ్ అదానీ 106 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే 17వ స్థానంలో కొనసాగుతున్నారు.
ఒక్క రోజులోనే ఆయన సంపద 7.16 బిలియన్లు పెరిగినట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ సంస్థ నివేదిక తెలిపింది. ఈ ఒక్క ఏడాదిలోనే గౌతమ్ అదానీ సంపద భారీగా పెరిగింది. 2026లో ఇప్పటివరకు ఆయన సంపద 21.4 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ నివేదికతో అదానీ.. ఇప్పుడు బిల్‌గేట్స్‌ను కూడా దాటేశాడు. బిల్‌గేట్స్ సంపద 104 బిలియన్ డాలర్లుగా ఉంది. భారతీయ సంపన్నుడు ముకేష్ అంబానీ కూడా అదానీ వెనుకే ఉన్నాడు. అంబానీ 90.2 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ సంపన్నుల్లో 20వ స్థానంలో ఉన్నారు. అదానీతో పోలిస్తే మూడు స్థానాలు వెనుకబడి పోయాడు. ఎప్పట్లాగే ప్రపంచ కుబేరుల్లో ఎక్స్, టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో ఉన్నారు. అమెరికాకు చెందిన ఆయన సంపద 645 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఆ తర్వాత 289 బిలియన్ డాలర్లతో ల్యారీ పేజ్ రెండో స్థానంలో, 274 బిలియన్ డాలర్లతో జెఫ్ బెజోస్ మూడో స్థానంలో ఉన్నారు. ఇక.. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో తీవ్ర ఒడుదొడుకులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్ యుద్ధం, చమురు ధరలు వంటి కారణాలతో స్టాక్ మార్కెట్లు అనిశ్చితిలో ఉన్నప్పటికీ.. ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గౌతమ్ అదానీ తన సంపదను పెంచుకుంటున్నాడని విశ్లేషకులు అంటున్నారు.