న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: గౌతమ్ అదానీ సంపద అంతకంతకూ పెరుగుతూపోతున్నది. ఇప్పటికే ముకేశ్ అంబానీని వెనక్కినెట్టి భారత అపర కుబేరుడిగా, ఆసియాలోకెల్లా అత్యంత ధనవంతుడిగా రికార్డు సృష్టించిన అదానీ.. ఇప్పుడు ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల నివేదికలో వారెన్ బఫెట్‌ను దాటేసి టాప్-5లో నిలిచారు. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి అదానీ గ్రూప్ సంస్థల అధిపతి గౌతమ్ అదానీ సంపద విలువ 123.7 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఫోర్బ్స్ తాజాగా తెలియజేసింది. ఇదే సమయంలో బఫెట్ సంపద 121.7 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు పేర్కొన్నది. దీంతో ప్రపంచ సంపన్నులలో ఐదో స్థానంలోకి అదానీ వచ్చారు. కాగా, 269.7 బిలియన్ డాలర్లతో ఎలాన్ మస్క్ అగ్ర స్థానంలో ఉన్నారు.
ఆ తర్వాతి స్థానాల్లో జెఫ్ బెజోస్ (170.2 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్ (167.9 బిలియన్ డాల ర్లు), బిల్‌గేట్స్ (130.2 బిలియన్ డాలర్లు) ఉన్నట్టు ఫోర్బ్స్ తెలియజేసింది. ఈ ఏడాది అదానీ సంపద విలువ ఏకంగా 43 బిలియన్ డాలర్లు ఎగబాకినట్టు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ చెప్తున్నది. అదానీ పోర్ట్‌ఫోలియో 56.2 శాతం ఎగిసింది. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, విద్యుదుత్పత్తి, పంపిణీ తదితర రంగాల్లో అదానీ వ్యాపారాలు సాగుతుండగా, 6 అదానీ గ్రూప్ సంస్థలు స్టాక్ మార్కెట్లలో ట్రేడ్ అవుతున్నాయి.