న్యూఢిల్లీ, నవంబర్ 2: ప్రధాని నరేంద్ర మోది సన్నిహితుడిగా పేరొందిన గౌతమ్ అదానీ మీడియా రంగంలోకి శరవేగంగా విస్తరిస్తున్నారు. ఇప్పటికే ఎన్డీటీవీని టేకోవర్ చేసిన అదానీ గ్రూప్ తాజాగా డిజిటల్ బిజినెస్ న్యూస్ ప్లాట్‌ఫామ్ బీక్యూ ప్రైమ్ (గతంలో బ్లూంబర్గ్క్వింట్)ను పూర్తిగా అధీనంలోకి తెచ్చుకున్నారు. బీక్యూ ప్రైమ్‌ను నిర్వహించే క్వింటిల్లిన్ బిజినెస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లో (క్యూబీఎంఎల్) మిగిలిన 51 శాతం వాటాను సొంతం చేసుకున్నారు.
ఇదే గ్రూప్ 2022 మార్చిలో 49 శాతం క్వింట్ వాటాను కొనుగోలు చేసింది. వాస్తవానికి ఈ కొనుగోలు తర్వాతే ఎన్డీటీవీలో మెజారిటీ వాటాను చేజిక్కించుకుంది. క్యూబీఎంఎల్‌లో 51 శాతం వాటా కోసం తమ సబ్సిడరీ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ షేర్ పర్చేజ్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేసినట్టు అదానీ ఎంటర్ప్రైజెస్ గురువారం స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది.
లావాదేవీ విలువను వెల్లడించలేదు. గతంలో రూ.47.84 కోట్లకు 49 శాతం వాటాను కొన్నది. ప్రస్తుతం సంస్థ ను పూర్తి అధీనంలోకి తెచ్చుకునేందుకు మెజారిటీ వాటా కొ న్నందున, ఈ లావాదేవీ విలువ అధికంగా ఉం టుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. జర్నలిస్ట్, వాణిజ్యవేత్త రాఘవ్ బెహల్ ప్రమోట్ చేసిన క్వింటిల్లిన్ మీడియా యూఎస్‌కు చెందిన ఫైనాన్షియల్ న్యూస్ ఏజెన్సీ బ్లూంబర్గ్‌తో కలసి జాయింట్ వెంచర్‌గా బ్లూంబర్గ్ క్వింట్‌ను నడిపారు. గత ఏడాది మార్చిలో ఈ వెంచర్ నుంచి బ్లూంబర్గ్ వైదొలిగింది. బిజినెస్ న్యూస్ చానల్ సీఎన్‌బీసీ టీవీ 18 రాఘవ్ బెహల్ నేతృత్వంలోని నెట్వర్క్ 18 గ్రూప్ నెలకొల్పిందే. ఈ గ్రూప్‌ను రిలయన్స్‌కు విక్రయించారు. అటుతర్వాత బ్లూంబర్గ్ క్వింట్‌ను ప్రారంభించారు.