కరోనా సంక్షోభం ఉన్నా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నా.. ధనవంతుల సంపద మాత్రం పెరుగుతూనే ఉన్నది.
ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల వద్ద ఉన్న మొత్తం సంపద విలువ 15.2 లక్షల కోట్ల డాలర్లు. గత పదేండ్లలో భారతీయ బిలియనీర్ల సంపదే 700 బిలియన్ డాలర్లకు ఎగిసింది.
గౌతమ్ అదానీ సంపద విలువ ఏడాది కాలంలో ఏకంగా 153 శాతం ఎగబాకింది. గతేడాది ప్రతీ వారం రూ.6,000 కోట్లు ఎగిసినట్టు తాజా ప్రపంచ శ్రీమంతుల జాబితా వివరాల్లో తేలడం గమనార్హం.
న్యూఢిల్లీ, మార్చి 16: దేశంలో అంబానీ, అదానీల హవా కొనసాగుతున్నది. ముఖ్యంగా గౌతమ్ అదానీ సంపద విలువ రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నా.. ధనవంతుల సంపదపై మాత్రం ఆ జాడే లేదు. గతేడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ సంపద 24 శాతం ఎగిసి 103 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక గౌతమ్ అదానీ సంపద ఏకంగా 153 శాతం ఎగబాకి 81 బిలియన్ డాలర్లను తాకినట్టు తాజాగా విడుదలైన 2022 ఎం3ఎం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 11వ ఎడిషన్ పేర్కొన్నది. గతేడాది ప్రతీ వారం రూ.6,000 కోట్లు ఎగబాకింది. దీంతో ఏడాది కాలంలో అదానీ సంపద 49 బిలియన్ డాలర్లు పుంజుకోగా.. టాప్-3 గ్లోబల్ బిలియనీర్లు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ కంటే ఇది ఎక్కువ కావడం విశేషం. అంతేగాక ఈ శ్రీమంతుల జాబితాలో గడిచిన ఐదేండ్లకుపైగా కాలంలో అదానీ 86 ర్యాంకులు ఎగబాకినట్టు తేలింది. ఈ క్రమంలో భారత్‌లోనేగాక ఆసియా దేశాల్లోనే అపర కుబేరుడిగా ఏండ్ల తరబడి వెలుగొందుతున్న ముకేశ్ అంబానీకి అదానీ చేరువవుతుండటం గమనార్హం.
హెల్త్‌కేర్ జోష్
భారతీయ ఆరోగ్య సంరక్షణ రంగం.. శ్రీమంతుల నిలయంగా తయారైంది. దేశంలోని బిలియనీర్లలో అత్యధికులు ఈ రంగానికి చెందినవారే. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత సైరస్ పూనవాలా గడిచిన ఐదేండ్లకుపైగా కాలంలో గ్లోబల్ సంపన్నుల జాబితాలో 72 ర్యాంకులు ఎగిసి 55వ స్థానంలోకి వచ్చారు. గతేడాదితో చూస్తే 41 శాతం వృద్ధితో ఈయన సంపద 26 బిలియన్ డాలర్లను తాకింది. ప్రపంచ హెల్త్‌కేర్ రంగంలో పూనవాలానే కుబేరుడిప్పుడు. పెయింట్స్, ఏవియేషన్, టెలికం, సిమెంట్, బిస్కట్ల తయారీ రంగాల్లోనూ భారతీయులే ప్రపంచంలో అత్యంత ధనవంతులు. పెయింట్స్‌లో 9.7 బిలియన్ డాలర్లతో ఏషియన్ పెయింట్స్‌కు చెందిన అశ్విన్ ఎస్ దనీ కుటుంబం, ఏవియేషన్‌లో ఇండిగోకు చెందిన రాకేశ్ గంగ్వాల్ (4.3 బిలియన్ డాలర్లు), రాహుల్ భాటియా కుటుంబం (4.2 బిలియన్ డాలర్లు), టెలికంలో రిలయన్స్ జియో అధినేత ముకేశ్ అంబానీ కుబేరులుగా ఉన్నారు. సిమెంట్ తయారీలో 18 బిలియన్ డాలర్ల సంపదతో అల్ట్రాటెక్ అధిపతి కుమార మంగళం బిర్లా, బిస్కట్ల ఉత్పత్తిలో 7.5 బిలియన్ డాలర్లతో బ్రిటానియాకు చెందిన నుస్లి వాడియా కుటుంబం టాప్‌లో ఉన్నారు. ఇక 3.3 బిలియన్ డాలర్లతో బైజూ రవీంద్రన్ కుటుంబం విద్యా రంగంలో ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు.
జాబితా ముఖ్యాంశాలు
ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 3,381 మంది బిలియనీర్లు. గతేడాదితో పోల్చితే 153 మంది అధికం. వీరందరి సంపద 4 శాతం వృద్ధితో 15.2 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నది.
దేశంలో 215 మంది బిలియనీర్లు. నిరుడుతో చూస్తే కొత్తగా 58 మంది పెరిగారు. విదేశాల్లో స్థిరపడ్డవారితో కలిపితే మొత్తం భారతీయ బిలియనీర్ల సంఖ్య 249.
ప్రపంచంలో బిలియనీర్లు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ (215)కు మూడో స్థానం. మొదటి రెండు స్థానాల్లో చైనా (1,133), అమెరికా (716) ఉన్నాయి.
గడిచిన పదేండ్లలో ప్రతీ ఐదేండ్లకు భారత్‌లో బిలియనీర్ల సంఖ్య రెట్టింపైంది. దేశంలో వారసత్వ సంపదతో కాకుండా స్వయంకృషితో ఎదిగిన బిలియనీర్లు 119 మంది ఉన్నారు.
దేశంలోని బిలియనీర్లలో హెల్త్‌కేర్ రంగానికి చెందినవారు అత్యధికంగా 46 మంది ఉన్నారు. ఆ తర్వాత కన్జ్యూమర్ గూడ్స్ (29), కెమికల్స్ (23) రంగాల్లో ఉన్నారు.
గడిచిన పదేండ్లకుపైగా కాలంలో భారతీయ బిలియనీర్ల సంపద దాదాపు 700 బిలియన్ డాలర్లు ఎగిసింది. ఇది స్విట్జర్లాండ్ జీడీపీతో సమానం. యూఏఈ జీడీపీతో చూస్తే రెట్టింపు.
ముంబైలో అత్యధికంగా 72 మంది బిలియనీర్లున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో న్యూఢిల్లీ (51), బెంగళూరు (28) ఉన్నాయి.
గతేడాది ప్రతీ వారం రూ.6,000 కోట్లు పెరిగిన గౌతమ్ అదానీ సంపద. గడిచిన ఐదేండ్లలో గ్లోబల్ ధనవంతుల జాబితాలో ఏకంగా 86 స్థానాలు పుంజుకుని 12వ స్థానంలోకి రాక.
గ్లోబల్ టాప్-10 ధనవంతుల జాబితాలో భారత్ నుంచి ముకేశ్ అంబానీకే చోటు. 103 బిలియన్ డాలర్లతో ఆసియాలోనే అపర కుబేరుడిగా ఉన్న ముకేశ్ 9వ స్థానంలో ఉన్నారు.
క్రిప్టో కరెన్సీల విలువ ఎగబాకుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 17 మంది బిలియనీర్లుగా అవతరించారు.
టాప్-10 భారతీయ కుబేరులు