RBI Governor | భవిష్యత్‌లో డిజిటల్ మనీ లావాదేవీలే జరుగుతాయని, ఏ ఒక్కరూ దాని నుంచి తప్పించుకోలేరని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. జీ-30 వార్షిక అంతర్జాతీయ బ్యాంకింగ్ సదస్సులో ఆయన మాట్లాడుతూ సీమాంతర చెల్లింపుల కోసం సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీల చెల్లింపులకు వసతులు కల్పిస్తూ బహుళ పక్ష సహకారం అవసరం అన్నారు. శనివారం రాత్రి వాషింగ్టన్ డీసీలో జరిగిన సదస్సులో శక్తికాంత దాస్ మాట్లాడుతూ ‘వివిధ రూపాల్లో తక్కువ ఖర్చుతో వేగంగా, ఇన్ స్టంటేనియస్గా సీమాంతర నిధుల బదిలీకి సీబీడీటీకి అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా ముందడుగు వేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో బహుళ పక్ష ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది’ అని అన్నారు.
మనీ, చెల్లింపుల భవిష్యత్ పై జరిగిన ప్యానెల్ చర్చాగోష్టిలో శక్తికాంత దాస్ పాల్గొన్నారు. ఈ చర్చాగోష్టిలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆండ్రూ బైలీ, బీఐఎస్ జనరల్ మేనేజర్ (బ్యాంక్ ఆఫ్ మెక్సికో మాజీ గవర్నర్) అగస్టింగ్ కార్ స్టెన్స్ పాల్గొన్నారు. సీబీడీసీ ప్రమోషన్లో, ప్రత్యేకించి డిజైనింగ్‌లో ప్రతి అంశంలోనూ బహుళ పక్ష సహకారం అవసరం అని పిలుపునిచ్చారు. ‘వివిధ దేశాల మధ్య సురక్షితంగా, చౌకగా, శరవేగంగా మనీ ట్రాన్స్ ఫర్ చేయడానికి సీబీడీటీ మోడల్‌గా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు. దాంతోపాటు ఇబ్బందులు పొంచి ఉన్నాయని తెలిపారు. క్యాపిటల్ రాకపోకల్లో అనిశ్చితికి దారి తీయవచ్చునన్నారు. సీబీడీసీ చలామణిలో సమస్యల పరిష్కారానికి సాంకేతిక, వ్యవస్థీకృత పరిష్కార మార్గాలు అవసరం అని చెప్పారు.