హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌ను క్వాంటం సిటీగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. క్వాంటం టెక్నాలజీలో తెలంగాణను గ్లోబల్ లీడర్‌గా మార్చేలా నిపుణులు, పరిశ్రమల భాగస్వామ్యంతో దేశంలోనే తొలిసారిగా లాంగ్ టర్మ్ క్వాంటం స్ట్రాటజీని రూపొందించినట్లు ఆయన చెప్పారు. ట్రిపుల్ఐటీ హైదరాబాద్‌లో నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ ఫర్ క్వాంటం అండ్ తెలంగాణ క్వాంటం స్ట్రాటజీని గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమారతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ఆవిషరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అప్పట్లో విద్యుత్తు, ఇంటర్నెట్ లాంటి ఆవిషరణలు ప్రపంచం రూపురేఖలు మార్చాయని, అదే తరహాలో రాబోయే రోజుల్లో క్వాంటం టెక్నాలజీ కూడా అనేక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నదని చెప్పారు. ఏఐ, క్వాంటం టెక్నాలజీ తదితర కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌లో తెలంగాణను గ్లోబల్ లీడర్‌గా మార్చేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. స్టార్టప్‌లకు ఆర్థిక భరోసా కల్పించేలా ‘ఫండ్స్ ఆఫ్ ఫండ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం అందుబాటులోకి రానున్నట్టు మంత్రి చెప్పారు. దీంతోపాటు పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి ‘ఇండస్ట్రీ డే’ పేరుతో ప్రతి వారంలో ఒకరోజు అధికారులు, ప్రతి నెలలో ఒక రోజు సంబంధిత మంత్రి పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు చెప్పారు.