Budget 2022 | కరోనా మహమ్మారి ప్రభావం నుంచి రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. సత్ఫలితాలు రావడం మొదలైంది. అయితే రికవరీ ఓ మోస్తరుగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రీ-కరోనా నాటి స్థాయికి రియాల్టీ రంగం కోలుకోవాలంటే ప్రభుత్వం నుంచి మద్దతు అవసరం అని నిపుణులు చెబుతున్నారు. కరోనాతో రియాల్టీ అనుబంధ రంగాలన్నీ తిరోగమనంలో పడ్డాయి. ప్రతికూల పరిస్థితుల నుంచి కోలుకున్న రియాల్టీ రంగం ఈ ఏడాది దశల వారీగా వృద్ధి సాధిస్తుందని భావిస్తున్నారు. సమర్థవంతంగా రియాల్టీ రికవరీ, వృద్ధి కోసం బడ్జెట్లో రాయితీలు కల్పించాలని కోరుతున్నారు.
హౌసింగ్ సెక్టార్‌కు డిమాండ్ పెంచేందుకు ఇండ్ల కొనుగోలుదారులకు టాక్స్ ఇన్సెంటివ్‌లు, రిలీఫ్స్ కల్పించాలని రియాల్టీ రంగం కోరుతున్నది. ఐటీ శ్లాబ్‌లు సవరించి మధ్యతరగతి ప్రజలకు అదనపు టాక్స్ బెనిఫిట్లు కల్పించాలని అభ్యర్థిస్తున్నది. దీనివల్ల ఇండ్ల కొనుగోలుదారుల చేతిలో ఖర్చు చేయతగినంత సొమ్ము ఉంటుందని భావిస్తున్నది. ఇండ్ల కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఐటీ చట్టంలోని 24 (బీ) సెక్షన్ కింద ఇంటి రుణం వడ్డీపై పన్ను రాయితీని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలన్న ప్రతిపాదన వినిపిస్తున్నది.
ఆస్తుల్లో ఆకర్షణీయ పెట్టుబడులు పెట్టడానికి రెంటల్ ఇన్‌కంపై పూర్తి పన్ను రాయితీ కల్పించాలని కొన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. రూ.75 లక్షల్లోపు ఇండ్లను చౌక క్యాటగిరీలోకి మార్చడానికి వారికి అడ్వాంటేజీలు కల్పించాలన్న సూచన వినిపిస్తున్నది. నిర్మాణంలో ఉన్న ఇండ్లపై జీఎస్టీ తగ్గించాలన్న అభ్యర్థన కూడా ఉంది. ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్‌ను వెనక్కు తీసుకురావడాన్ని స్వాగతించాలంటున్నారు. స్టీల్, మార్బుల్, టింబర్, ప్లాస్టిక్, సిమెంట్ వంటి ముడి సరుకుపై జీఎస్టీ తగ్గిస్తే ఇండ్ల నిర్మాణాలను ప్రోత్సహించవచ్చునని నిపుణులు అంటున్నారు. జీఎస్టీ తగ్గించడంతో ఈ బెనిఫిట్లను ఇండ్ల కొనుగోలుదారులకు ట్రాన్స్ఫర్ చేయడానికి వీలవుతుంది. ప్రస్తుతం ఇండ్ల కొనుగోలుదారులు జీఎస్టీతోపాటు స్టాంప్ డ్యూటీ కూడా చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో యునిఫైడ్ టాక్స్ తేవాలని తద్వారా బిజినెస్ మరింత సరళతరం అవుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం అమలులో ఉన్న స్టాంప్ డ్యూటీతోపాటు ఆస్తుల విక్రయాలపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా తగ్గించాలని కోరుతున్నారు. కో వర్కింగ్ స్పేస్‌లపై వచ్చే ఆదాయంపై విధించే టీడీఎస్ తగ్గిస్తారని సంబంధిత కో వర్కింగ్ స్పేస్ ఓనర్లు ఆశాభావంతో ఉన్నారు. రియాల్టీ రంగానికి విధించిన రెగ్యులేటరీ నిబంధనలను సరళతరం చేస్తే డెవలపర్లు సకాలంలో తమ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి వీలవుతుందంటున్నారు. రియాల్టీ రంగాన్ని ఇన్ఫ్రా స్ట్రక్చర్ రంగంలో చేర్చాలన్న నిబంధన సుదీర్ఘ కాలంగా ఉంది. మౌలిక వసతుల రంగంలోకి రియాల్టీని తేవడంతో డెవలపర్లు తమ ప్రాజెక్టులకు అవసరమైన నిధులు సేకరించడం తేలికవుతుందంటున్నారు.