ముంబై, జూలై 23: పలు కార్పొరేట్ సంస్థలు, స్టార్టప్‌లు తెలంగాణను కేంద్రంగా ఎంచుకుంటున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌కు భారీగా డిమాండ్ పెరుగుతున్నది. ఈ క్రమంలో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోకెల్లా హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ సరఫరా జోరందుకుంది. ఈ ఏడాది జనవరి-జూన్ మధ్యకాలంలో దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ఈ సరఫరా 96 శాతం పెరగ్గా, భాగ్యనగరంలో ఏకంగా మూడు రెట్లు పెరిగినట్లు గ్లోబల్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ సర్వీసుల సంస్థ కొలిర్స్ తెలిపింది. అన్ని ఇతర నగరాలకంటే అధికంగా 6.4 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ హైదరాబాద్‌లో క్రియేట్ అయ్యింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పుణె, ముంబై, ఢిల్లీఎన్సీఆర్లలో ఆఫీస్ స్పేస్ సరఫరా ఈ ఆరు నెలల్లో 23.7 మిలియన్ చదరపు అడుగులకు చేరింది.
2021 జనవరి-జూన్‌లో ఇది 12.1 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. హైదరాబాద్‌లో ఇది 1.9 మిలియన్ చదరపు అడుగుల నుంచి 6.4 మిలియన్ చదరపు అడుగులకు పెరిగినట్టు కొలిర్స్ రిపోర్ట్ వెల్లడించింది. ఇక ఆరు నగరాల్లో ఆఫీస్ స్పేస్ స్థూల లీజింగ్ డిమాండ్ 2.5 రెట్లు పెరిగి 10.5 మిలియన్ చదరపు అడుగుల నుంచి 27.5 మిలియన్ చదరపు అడుగులకు చేరినట్టు కొలిర్స్ ఇండియా సీఈవో రమేశ్ నాయర్ చెప్పారు. డిమాండ్ పెరగడం, కొత్త సరఫరా పరిమితంగా ఉండటంతో గత 10 త్రైమాసికాల్లో ఎన్నడూ లేనంతగా ఆఫీస్ స్పేస్ వేకెన్సీ తగ్గిందన్నారు. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆఫీస్ స్పేస్ సగటు వేకెన్సీ 17 శాతానికి పరిమితమైందని వివరించారు.