విమానయానం అందరికీ అందుబాటులోకి వచ్చిన దగ్గర్నుంచి విమాన టిక్కెట్ కుంభకోణాలు పెరుగుతున్నాయి.
సోషల్ మీడియా, నకిలీ వెబ్సైట్లను ఆసరాగా చేసుకుని.. మోసగాళ్లు నమ్మశక్యం కాని రీతిలో తక్కువ ధరలకే ఎయిర్‌లైన్ టిక్కెట్లను అమ్మకానికి పెడుతున్నారు.
దీన్నిచూసి అమాయకులు ఇట్టే ఆకర్షితులై నిండా మునుగుతున్నారు. దీంతో ఈ రకమైన మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే నష్టం తప్పదని అటు పోలీసులు, ఇటు విమానయాన సంస్థలు ప్రయాణీకుల్ని హెచ్చరిస్తున్నాయి.
రాజేశ్ హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లాలనుకుంటున్నాడు. విమాన టిక్కెట్ల కోసం ఆన్లైన్లో వెతుకుతుండగా, తక్కువ ధరకే కనిపించాయి. ఎయిర్‌లైన్ అధికారిక వెబ్సైట్, పైగా పేరొందిన ట్రావెల్ ఏజెన్సీయేకదా అని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బ్యాంక్ ద్వారా నగదు బదిలీ చేసి టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. తీరా బయలుదేరి విమానాశ్రయానికి వెళ్తే అక్కడ మోసపోయానని గుర్తించాడు. సెలవులు రావడంతో మహేశ్ కూడా కుటుంబంతో కలిసి టూర్ ప్లాన్ చేశాడు. అందరికీ టిక్కెట్లు బుక్ చేసుకుని లగేజీలతో వెళ్తే అసలు సంగతి తెలిసి లబోదిబోమన్నాడు. ఇది కేవలం రాజేశ్, మహేశ్లకేకాదు.. ఈమధ్య కాలంలో ఎందరికో ఎదురవుతున్న చేదు ఘటనలు. ప్రస్తుతం ఎయిర్‌లైన్ టిక్కెట్ డీల్స్ సర్వసాధారణమైపోయాయి. ఇందుకు తగ్గట్టే ఇటీవలికాలంలో విమాన టిక్కెట్ మోసాలూ తరచూ వినిపిస్తున్నాయి. నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియా వేదికగా అక్రమాలకు తెగబడుతున్నారు. తక్కువ ధరకే ఆయా పర్యాటక ప్రాంతాలకు లేదా నగరాలకు ప్రయాణించవచ్చని నమ్మిస్తూ అమాయకులకు స్కామర్లు టోకరా వేస్తున్నారు. ఆఫర్ల మాయలోపడి వారు చెప్పినట్టే తక్షణ చెల్లింపులు చేసి చివరకు చేతులు కాల్చుకుంటున్నారు.
ఎయిర్‌లైన్ కంపెనీలు.. ప్రత్యేక క్యాంపెయిన్లలో భాగంగా లేదా పండుగలు, సెలవుల సందర్భంగా టిక్కెట్లపై డిస్కౌంట్లను ఆఫర్ చేస్తుంటాయన్న విషయం తెలిసిందే. సరిగ్గా మోసగాళ్లకు ఇదే లాభిస్తున్నది. వీటిని అడ్డం పెట్టుకునే అమాయక ప్రయాణీకులను మోసం చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.
ఇదీ.. సంగతి
చూడ్డానికి విమానయాన సంస్థల అధికారిక వెబ్సైట్లలాగే కనిపించే నకిలీ వెబ్సైట్లు, అచ్చం అలాగే ఉండే ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీల నెట్‌వర్క్‌లను, ఏజెంట్లను ఆసరాగా చేసుకుని స్కామర్లు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. తక్కువ ధరలకు టిక్కెట్లను పెట్టి వాటి కోసం వచ్చిన కస్టమర్లకు వెంటనే పేమెంట్ చేయాల్సిందిగా సూచిస్తున్నారు. ఆఫర్ ఎక్కడో మిస్సవుతుందోనన్న కంగారులో బ్యాంక్ బదిలీ, వర్చువల్ కరెన్సీలు లేదా నగదుతో ప్రయాణీకులు కొనేస్తున్నారు.
ఇలా గమనించండి..
టిక్కెట్ ధర బాగా తక్కువగా ఉంటే అనుమానించాలి. అలాగే విమాన సర్వీసు ఒకటి, రెండ్రోజుల్లో బయలుదేరుతున్నదంటూ ఆఫర్లు పెట్టినా అప్రమత్తం కావాల్సిందే. సదరు వెబ్సైట్లో సమాచారం అరకొరగా ఉన్నా అక్కడి నుంచి వెనక్కి తగ్గడం ఉత్తమం అని సైబర్ క్రైమ్ నిపుణులు సూచిస్తున్నారు.
ఇలా చేయండి..
విమాన టిక్కెట్లను నేరుగా ఎయిర్‌లైన్ సంస్థ నుంచిగానీ, ప్రధాన ట్రావెల్ ఏజెన్సీలకు వెళ్లిగానీ కొనడం మంచిది. ఇక ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే దాని విశ్వసనీయతను ముందుగా చెక్ చేయాలి. అంతేగాక సురక్షితమైన పేమెంట్ వ్యవస్థ ఉంటేగానీ ముందుకెళ్లవద్దు. అలాగే టిక్కెట్ క్యాన్సిల్ చేసుకుంటే రిఫండ్ పాలసీ తదితరాలన్నింటినీ క్షుణ్ణంగా చదవాలి. ఎవరికీ మీ వివరాలను, ముఖ్యంగా క్రెడిట్, డెబిట్ కార్డు నెంబర్లను, ఓటీపీలను చెప్పరాదు.