FPI Out Flows | దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెలలో తొలి పది రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ సంస్థల నుంచి రూ.17 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడంతోపాటు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇచ్చారు. గత నెలలో నికర విత్ డ్రాయల్స్ రూ.8,700 కోట్ల కంటే ఇది ఎక్కువ. యూఎస్ బాండ్ల విలువ స్థిరంగా పెరుగుతుండటంతోపాటు మారిషస్‌తో భారత్ పన్నుల ఒప్పందంలో మార్పులు చోటు చేసుకుంటాయన్న సంకేతాల మధ్య భారత్ సంస్థల్లో షేర్లను విదేశీ ఇన్వెస్టర్లు విక్రయించారు.
గత మార్చిలో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) నికరంగా రూ.35,098 కోట్ల పెట్టుబడులు పెడితే అంతకుముందు ఫిబ్రవరిలో రూ.1,539 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. ఎన్నికల ఫలితాలతోపాటు గత ఆర్థిక సంవత్సరం కార్పొరేట్ సంస్థల మార్చి త్రైమాసికం ఆర్థిక ఫలితాలపై ఇన్వెస్టర్లు కేంద్రీకరించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందిస్తారని ట్రేడ్జిని సీఓఓ త్రివేష్ డీ పేర్కొన్నారు.