FPI | గత రెండు నెలలుగా దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు ఆగస్టులో నిధులు ఉపసంహరించుకున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకూ దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు రూ.13,400 కోట్ల పైచిలుకు వాటాలను విక్రయించారు. జపాన్ కరెన్సీ ‘యెన్’ క్యారీ ట్రేడ్ తోపాటు ఈ ఏడాది అమెరికాలో మాంద్యం ముప్పు పొంచి ఉందన్న భయాల మధ్య విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ).. దేశీయ స్టాక్ మార్కెట్లలో వాటాలు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఎఫ్‌పీఐలు రూ.22,134 కోట్ల విలువైన వాటాలు కొనుగోలు చేశారు.
ఒకవేళ దేశీయ స్టాక్ మార్కెట్లలో వృద్ధి కొనసాగినట్లయితే ఎఫ్‌పీఐలు మరింతగా తమ వాటాలను విక్రయించే అవకాశం ఉందని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటర్జిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు. విదేశీ మార్కె్ట్లలో పరిస్థితిని బట్టి ఎఫ్ పీఐల కదలికలు ఉంటాయన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ నెల తొమ్మిదో తేదీ వరకూ ఎఫ్‌పీఐలు రూ.13,431 కోట్ల విలువైన షేర్లు ఉపసంహరించుకున్నారు.
దేశీయంగా సంస్కరణలు కొనసాగుతాయన్న అంచనాలు, ఊహించినదానికన్నా మెరుగ్గా కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాలు ఉండటంతోపాటు సుస్థిరంగా భారత్ వృద్ధిరేటు సాగుతుందన్న అంచనాల మధ్య జూలైలో రూ.32,365 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. అంతకుముందు జాతీయ స్థాయిలో రాజకీయ సుస్థిరత నెలకొనడంతో మార్కెట్లు పుంజుకోవడంతో జూన్ నెలలో ఎఫ్ పీఐలు రూ.26,565 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ లో రూ.8,700 కోట్లు, మేలో రూ.25,586 కోట్ల విలువైన షేర్లను ఎఫ్ పీఐలు ఉపసంహరించుకున్నారు.