FPI Investments | దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో రూ.33,600 కోట్ల పై చిలుకు పెట్టుబడులు పెట్టారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ సర్కార్ ఆర్థిక సంస్కరణలు కొనసాగిస్తుందన్న అంచనాలు, సుస్థిర ఆర్థిక వృద్ధిరేటు, అంచనాలకు మించి వివిధ కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కొనసాగిస్తూ వచ్చారు. అయితే, ఈ నెల 24-26 మధ్య మాత్రం రూ.7,200 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్స్ (ఎఫ్ అండ్ ఓ), ఈక్విటీ ఇన్వెస్ట్ మెంట్లపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంచడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీన పడినా అది తాత్కాలికమేనని విశ్లేషకులు చెబుతున్నారు. భారతీయ ఈక్విటీలు విదేశీ పెట్టుబడులకు అనుకూలం అని అంటున్నారు.
ఈ నెల 26 వరకూ దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) నికర పెట్టుబడులు రూ.33,688 కోట్లు కాగా, గత నెలలో రూ.26,565 కోట్లు మాత్రమే. ఎన్నికల ఫలితాల తర్వాత ఎఫ్‌పీఐలు దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడి కాక ముందు రాజకీయ స్థిరత్వంపై అనిశ్చితితోపాటు మారిసస్ ప్రభుత్వంతో పన్ను ఒప్పందాలను సమీక్షిస్తారన్న అంచనాల మధ్య గత మే నెలలో రూ.25,586 కోట్లు, ఏప్రిల్‌లో రూ.8,700 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించారు. ఇక అంచనాలకు మించి కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాలు వెలువడుతుండటంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్, విశ్వాసం బలోపేతం అవుతోంది.