హైదరాబాద్, అక్టోబర్ 25(నమస్తే తెలంగాణ): ఐఫోన్లు సహా వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారు చేసే ప్రముఖ తైవాన్ సంస్థ ఫాక్స్‌కాన్ హైదరాబాద్ ప్లాంట్‌ను రూ. 4,800 కోట్లతో విస్తరించాలని నిర్ణయించింది. వచ్చే ఆరు నుంచి ఎనిమిది మాసాల్లో కొంగరకలాన్ ప్లాంట్‌లో తమ ఉత్పత్తిని రెట్టింపు చేయాలనుకుంటున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఇక్కడ నెలకు లక్ష ఎయిర్పాడ్లు ఉత్పత్తి అవుతుండగా, విస్తరణ పూర్తయ్యాక ఇది రెండు లక్షలకు చేరుకుంటుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటకల్లో మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేస్తుండగా…కంపెనీ మన రాష్ట్రంలో ఎయిర్పాడ్లను ఉత్పత్తి చేస్తున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మార్చి 2003లో సదరు సంస్థ సుమారు రూ. 5,000 కోట్లతో కొంగరకలాన్‌లో ప్లాంట్‌ను నెలకొల్సిన విషయం విధితమే. దీనిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 24 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ పారిశ్రామిక అనుకూల విధానాలు, అప్పటి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఫాక్స్‌కాన్ సంస్థ ఇతర రాష్ర్టాలను కాదని తెలంగాణలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ యూనిట్లో ఎయిర్పాడ్ల ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ యూనిట్లో తయారైన ఎయిర్‌పాడ్‌లకు దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ అధికంగా ఉండటంతో ఈ యూనిట్ సామర్థాన్ని రెండింతలు పెంచుకున్నట్టు ప్రకటించింది.
తాజాగా సంస్థ మరో రూ. 4,800 కోట్లతో భారీగా విస్తరించనున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఈ యూనిట్లో 2 వేల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతుండగా, వచ్చే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఈ సంఖ్య 5 వేలకు చేరుకోనున్నారు. కీలక విడిభాగాల కొరత కారణంగా గత జూలై నెలలో ఎయిర్పాడ్ల ఉత్పత్తిని తాత్కాలికంగా తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ యూనిట్లో ఎయిర్‌పాడ్స్ 4, ఎయిర్‌పాడ్స్ ప్రొ 3 మాడల్స్తోపాటు ఫిట్నెస్ ఉత్పత్తులు, కనెక్టర్లు కూడా ఉత్పత్తి చేస్తున్నది. ఈ యూనిట్లో ఉత్పత్తైన వస్తువులను భారత్‌తోపాటు అమెరికా, యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్నది.
చైనాలో ఉన్న ప్లాంట్‌ను ఇతర దేశాలకు తరలించేయోచనలో ఉన్నట్టు గతంలోనే సంస్థ ప్రకటించింది. చైనా-తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నెలకొనడంతో ఈ తైవాన్ సంస్థ అక్కడి ప్లాంట్లను ఇతర దేశాలకు తరలించనున్నట్టు తెలిపింది. దీంట్లోభాగంగానే చైనా నెలకొల్పిన ప్లాంట్‌లోని యంత్రాలను భారత్‌కు తరలిస్తున్నట్టు గతంలోనే వెల్లడించింది. దేశీయంగా యాపిల్ ఐఫోన్లను సంస్థనే ఉత్పత్తి చేస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 10 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసింది. ఇది గతేడాది ఇదే సమయంలో ఎగుమతైన 5.71 బిలియన్ డాలర్ల ఫోన్ల కంటే 75 శాతం అధికంగా నమోదవడం విశేషం.
రాష్ట్రంలో ఫాక్స్‌కాన్ కంపెనీ రావడంతో అనేక యాన్సిలర్ యూనిట్లకు మేలు చేకూరినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలు భారీగా విస్తరించిన విషయం విధితమే. ఈ క్రమంలోనే ఫాక్స్‌కాన్ సంస్థ ఏర్పాటు కావడం ఇక్కడి కంపెనీల ఎదుగుదలకు, అలాగే ఎలక్ట్రానిక్స్ రంగంలో మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించేందుకు దోహదపడినట్లు చెబుతున్నారు. గూగుల్, అమెజాన్, హువావే, ఆలీబాబా గ్రూప్, సిస్కో, డెల్, ఫేస్బుక్, సోనీ, మైక్రోసాఫ్ట్, నోకియా తదితర దిగ్గజ కంపెనీలు ఫాక్స్‌కాన్‌కు కస్టమర్లుగా ఉండటం విశేషం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహేశ్వరంలో ఐ-సిటీని అభివృద్ధి చేసిన విషయం విధితమే. అక్కడ ఇప్పటికే టీవీతో సహా వివిధ రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారవుతున్నాయి. ఫాక్స్‌కాన్ విస్తరణతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు కూడా ఏర్పాటయ్యేందుకు అవకాశముందని పరిశ్రమవర్గాలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి.