న్యూఢిల్లీ, మార్చి 14: దేశీయ రోడ్లపైకి మరో నాలుగు కొత్త మాడళ్లు దూసుకుపోవడానికి రెడీ అవుతున్నాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతితోపాటు ఎంజీ, వొల్వో, కియాలు తమ కొత్త మాడళ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి. వీటిలో రెండు ఎలక్ట్రిక్ వాహనాలు కాగా, మరో రెండు ఎస్‌యూవీలు. ఈ మాడళ్లను ఈ నెల చివర్లో మార్కెట్‌కు పరిచయం చేస్తున్నాయి. వాటి వివరాలు..
మారుతి ఈ-విటారా
దేశవ్యాప్తంగా ఈవీ కార్ల విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. దీంతో కార్ల తయారీ సంస్థలు వీటిపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నాయి. దీంట్లోభాగంగా మారుతి కూడా తన ఈ-విటారాను ఈ నెలలోనే మార్కెట్‌కు పరిచయం చేయబోతున్నది. ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025లో ప్రదర్శించిన ఈ మాడల్..విడుదలకంటే ముందే షోరూంలలో ప్రదర్శిస్తున్నది కూడా. సింగిల్ చార్జింగ్‌తో 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించనున్న ఈ మాడల్ ధర రూ.18 లక్షల నుంచి రూ.26.5 లక్షల మధ్యలో ఉంటుందని అంచనా.
ఎంజీ సైబర్స్టార్
చైనాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం ఎంజీ..మరో ఈవీ మాడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేయబోతున్నది. రెండు సీట్లు కలిగిన ఎలక్ట్రిక్ స్పోర్ట్ కారు సైబర్‌స్టర్‌ను ఈ నెలలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నది. 77 కిలోవాట్ల బ్యాటరీతో తయారైన ఈ కారు కూడా 600 కిలోమీటర్లు ప్రయాణించనున్నదని అంచనా. ప్రస్తుతానికి ఈ మాడల్ ధరను విడుదల చేయకపోయినప్పటికీ దీని ధర రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల మధ్యలో నిర్ణయించింది.
వొల్వో ఎక్స్‌సీ90
ఎడుగురు కూర్చోవడానికి వీలుండే ఎక్స్‌సీ90 మాడల్ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతున్నది వొల్వో. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే అడుగుపెట్టిన ఈ కారును ఈ నెల చివర్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నది. 2.0 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో తీర్చిదిద్దిన ఈ కారులో 8 గేర్లు, 12.3 ఇంచుల టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్స్‌తో తీర్చిదిద్దిన ఈ కారు ధరను నిర్ణయించలేదు.
కియా ఈవీ6
కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం కియా నయా ఈవీని విడుదల చేస్తున్నది. ఈవీ6 పేరుతో తీర్చిదిద్దిన 77.4 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ మాడల్ సింగిల్ చార్జింగ్‌తో 708 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. గంటకు 192 కి.మీ. వేగంతో దూసుకుపోనున్న దీని ధర రూ.60.97-రూ.65.97 లక్షల మధ్యలో నిర్ణయించింది.