Formula-E Race | హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలపై కాంగ్రెస్ సర్కారు అవలంభిస్తున్న వైఖరితో పరిశ్రమ వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. తాజాగా ఫార్ములా-ఈ రేసు ఒప్పందంపై విచారణ చేపట్టడం, కేసులు నమోదు చేయడంతో అటు పెట్టుబడిదారులు, ఇటు అధికార వర్గాలు కలత చెందుతున్నాయి. రాష్ట్రంలో ఇక ఏమాత్రం పరిశ్రమకు స్నేహపూర్వక వాతావరణం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ప్రభుత్వ వైఖరితో పరిశ్రమ భవిష్యత్తు అంధకారమయ్యే అవకాశముందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ సంగతి..
సహజంగా రాష్ర్టాలు అమలు చేసే సరళీకృత విధానాలు, ప్రభుత్వాల పనితీరు, స్నేహపూర్వక వాతావరణం తదితర అంశాల ఆధారంగా పెట్టుబడులు పెట్టడం, ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుంది. పెట్టుబడిదారులు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాక నిశ్చింతగా ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం, తదుపరి చర్యలు చేపట్టడం చేస్తారు. స్వతహాగానే ప్రభుత్వాలపై భరోసా ఉంటుంది కాబట్టి ధైర్యంగా వ్యాపారాలు చేసేందుకు ముందుకొస్తారు. అంతేకాదు, ప్రజాస్వామ్యంలో ఐదేండ్లకోసారి ప్రభుత్వాలు మారడం సహజ ప్రక్రియ. ఒక ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని ఆ తదుపరి వచ్చే ప్రభుత్వం కొనసాగించడం ఆనవాయితీ. దశాబ్దాలుగా ఇదే తరహా సంప్రదాయం కొనసాగుతూ వస్తున్నది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏదైనా పథకాన్ని కొనసాగించడం తదుపరి ప్రభుత్వానికి ఇష్టం లేకున్నా అప్పటికే మొదలైన పనులను పూర్తిచేసిన తరువాతే వాటిని నిలిపివేస్తారు. ఒప్పందాలు మాత్రం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా యథావిధిగా కొనసాగించాల్సి ఉంటుంది.
కేసులతో రచ్చ
గడిచిన పదేండ్లలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన స్నేహపూర్వక విధానాలకు ఆకర్షితులై ఎన్నో దేశ, విదేశాలకు చెందిన కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకొని వ్యాపారాలు చేసేందుకు, పరిశ్రమలు పెట్టుకునేందుకు ముందుకొచ్చాయి. అందులో ఫార్ములా-ఈ రేస్ కూడా ఒకటి. ఢిల్లీ, ముంబైకి సైతం దక్కని ఖ్యాతిని హైదరాబాద్‌కు సాధించాలనే సంకల్పంతోపాటు కాలుష్యరహిత రవాణాను ప్రోత్సహించే ఉద్దేశంతో బీఆర్ఎస్ సర్కారు ఆనాడు కార్ రేస్‌ను నిర్వహించాలని నిర్ణయించి ఒప్పందం చేసుకున్నది. ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన ఈ రేస్‌లను అర్ధాంతరంగా నిలిపివేయడంతో నిర్వాహకులు ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించారు. ఈ వ్యవహారం నడుస్తుండగానే అప్పటి మంత్రితోపాటు అధికారులపై కూడా ప్రభుత్వం కేసులు నమోదు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది.
ఆందోళన
గతంలో అనేక కంపెనీలు ప్రభుత్వం కల్పించే ప్రోత్సాహకాలు, ఇచ్చిన హామీలకు ఆకర్షితులై పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇందులో కొన్ని కంపెనీలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించగా, మరికొన్ని కంపెనీల వివిధ దశల్లో ఉంది. తాజాగా ప్రభుత్వం ఫార్ములా-ఈ విషయంలో తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న కంపెనీలతోపాటు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న కంపెనీల్లో ఆందోళన మొదలైంది. ఫార్మాసిటీ విషయంలోనూ ఇంచుమించు ఇలాగే జరిగింది. అన్ని అనుమతులూ వచ్చి పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న ఫార్మాసిటీని రద్దు చేయడంతో అప్పటికే పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న కంపెనీలు అయోమయంలో పడ్డాయి. ఈ పరిణామాలు చూస్తుంటే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదనే భావన సర్వత్రా కలుగుతున్నది. దీంతో ప్రభుత్వం తరపున ఒప్పందాలు చేసుకునేందుకు అధికారులు కూడా జంకుతున్నారు. ఇటీవల పలువురు ఐఏఎస్ అధికారులు సమావేశమై.. లిఖితపూర్వకంగా ఇస్తే తప్ప ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయరాదని నిర్ణయించినట్టు వార్తలు రావడం దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో పరిశ్రమ భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.