Forex Reserves | భారత్ ఫారెక్స్ రిజర్వ్ (Forex Reserve) నిల్వల్లో సరికొత్త రికార్డు నమోదైంది. గత నెల 27తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 12.5 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 704.89 బిలియన్ డాలర్లకు చేరాయి. ఒకవైపు మధ్య ప్రాచ్యంలో భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు పెరగడం గమనార్హం. సెప్టెంబర్ 27తో ముగిసిన వారానికి గత ఏడాది కాలంలో ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 113 బిలియన్ డాలర్లు పెరిగాయని ఆర్బీఐ తెలిపింది. ఒకవారంలో ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 12.5 బిలియన్ డాలర్లు వృద్ధి చెందడం ఇదే తొలిసారి. పాకిస్థాన్ జీడీపీ కంటే భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు మూడు రెట్లు.
ఫారిన్ కరెన్సీ అసెట్స్, గోల్డ్ రిజర్వ్స్ వృద్ధి చెందుతుండగా, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ పెరుగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లో క్షీణిస్తున్నాయి. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్ మీద రూపాయి మారకం విలువ మరింత పతనం కాకుండా ఎప్పటికప్పుడు ఆర్బీఐ జోక్యం చేసుకుంటున్నది. గత నెల 20తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 692.3 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2026 మార్చికల్లా భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 750 బిలియన్ డాలర్లు దాటతాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అంచనా వేసింది.