Forex Reserves | భారత్ ఫారెక్స్ రిజర్వ్ (Forex Reserve) నిల్వలు పతనం అయ్యాయి. ఈ నెల 13తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు దాదాపు రెండు బిలియన్ డాలర్లు పతనమై 652.87 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇది ఆరు నెలల కనిష్ట స్థాయికి సమానం అని వివరించింది.
ఈ నెల 13తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 1.988 బిలియన్ డాలర్లు తగ్గి 652.869 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకు ముందు ఐదో తేదీతో ముగిసిన వారానికి 3.235 బిలియన్ డాలర్లు పతనమై 654.857 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ పతనం కాకుండా ఆర్బీఐ జోక్యం చేసుకుంటున్నా, కొన్ని వారాలుగా ఫారెక్స్ రిజర్వు నిల్వలు పడిపోతూనే ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 704.885 బిలియన్ డాలర్లతో జీవిత కాల గరిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే.
ఫారెక్స్ రిజర్వు నిల్వల్లో ప్రధానమైన ఫారిన్ కరెన్సీ అసెట్స్ 3.047 బిలియన్ డాలర్లు తగ్గిపోయి 562.576 బిలియన్ డాలర్లకు చేరాయని శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన డేటా తెలిపింది. బంగారం రిజర్వు నిల్వలు 1.121 బిలియన్ డాలర్లు పతనమై 68.056 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్స్) 35 మిలియన్ డాలర్లు క్షీణించి 17.997 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లో భారత్ రిజర్వ్ నిల్వలు 27 మిలియన్ డాలర్లు తగ్గి 4.24 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి.